ప‌ది ఫ‌లితాల్లో స‌ర్కారీ బ‌డుల జోరు.. ప్రైవేటుకు ధీటుగా ప్ర‌తిభ‌..!

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కొడంగల్ నియోజకవర్గ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు.

ప‌ది ఫ‌లితాల్లో స‌ర్కారీ బ‌డుల జోరు.. ప్రైవేటుకు ధీటుగా ప్ర‌తిభ‌..!
X

దిశ, కొడంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కొడంగల్ నియోజకవర్గ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాసంస్థలకు సవాల్ విసురుతూ రికార్డు స్థాయి మార్కులను సాధించాయి. ఉపాధ్యాయుల ప్రత్యేక పర్యవేక్షణ, విద్యార్థుల కఠోర శ్రమ ఈ ఏడాది విద్యాశాఖలో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.

దౌల్తాబాద్ మండలంలో 94.85 శాతం ఉత్తీర్ణత..!

దౌల్తాబాద్ మండలం పది ఫలితాల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. మండల వ్యాప్తంగా మొత్తం 330 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 313 మంది విజయకేతనం ఎగురవేశారు. కేవలం 17 మంది విద్యార్థులు మాత్రమే తృటిలో ఉత్తీర్ణతను కోల్పోయారు. ఈ మండలంలో కేజీబీవీ పాఠశాల 35 మందికి 35 మందిని ఉత్తీర్ణులను చేసి 100 శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే జెడ్పీహెచ్ఎస్ బలంపేట 97 శాతం, చెల్లపూర్ 94.5 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ప్రదర్శన చేశాయి.

కొడంగల్ మండలంలో ఉర్దూ మీడియం హవా..!

కొడంగల్ మండలంలో మొత్తం 826 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 739 మంది ఉత్తీర్ణులయ్యారు. 87 మంది విద్యార్థులు వెనుకబడగా, మండలం మొత్తం 89.46 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసింది. ఇక్కడ ఉర్దూ మీడియం విద్యార్థులు ఏకంగా 98.19 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించారు. జెడ్పీహెచ్ఎస్ కొడంగల్ బాలుర, బాలికల పాఠశాలలతో పాటు అంగడి రైచూర్, హస్నాబాద్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలో వంద శాతం ఫలితాలను సాధించి శభాష్ అనిపించుకున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల టాపర్లు వీరే

మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా మార్కులు సాధించారు. దౌల్తాబాద్ ఎంజేపీ గురుకుల విద్యార్థి నాగచైతన్య 566 మార్కులతో ప్రభుత్వ విభాగంలో టాపర్‌గా నిలవగా, కొడంగల్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థిని జి. ప్రవస్తి 565 మార్కులతో సత్తా చాటారు. దౌల్తాబాద్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని అలేటి బిందు 538 మార్కులతో, జి. దీపక్ రెడ్డి 531 మార్కులతో, బలంపేటకు చెందిన ఎం. సింధు 523 మార్కులతో మెరిశారు. ప్రైవేట్ విభాగంలో కొడంగల్ ప్రొవిడెన్స్ స్కూల్ విద్యార్థిని సమ్రీన్ బేగం 567 మార్కులతో నియోజకవర్గ స్థాయిలోనే అగ్రస్థానంలో నిలిచారు. నవీన్ ఆదర్శ విద్యార్థిని రబియా జినాత్ 559 మార్కులు, హెచ్.ఎస్. కృష్ణవేణికి చెందిన వైశాలి 558 మార్కులతో తమ ప్రతిభను చాటుకున్నారు.

అధికారుల భరోసా..!

ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడకుండా, జూన్ లో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. వారి కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి అందరినీ ఉత్తీర్ణులను చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story