కొడంగల్‌లో ‘ఆరోగ్య’ విప్లవం.. సీఎం ఆశయాలకు ‘తుది’ మెరుగులు

by Nallavelli.Anjaneyulu |

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే 'వైద్య హబ్‌'గా అవతరిస్తోంది.

కొడంగల్‌లో ‘ఆరోగ్య’ విప్లవం.. సీఎం ఆశయాలకు ‘తుది’ మెరుగులు
X

దిశ, కొడంగల్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే 'వైద్య హబ్‌'గా అవతరిస్తోంది. సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న సీఎం ఆశయాలకు అనుగుణంగా రూ. 27 కోట్ల వ్యయంతో చేపట్టిన 220 పడకల ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుంది. నియోజకవర్గ ఇన్ చార్జి ఎ. తిరుపతి రెడ్డి దిశానిర్దేశంలో స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తుండటంతో వైద్య రంగంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.

90 శాతం పనులు పూర్తి.. ఆ 10 శాతమే కీలకం

ప్రస్తుతం ఆసుపత్రి భవనానికి సంబంధించి 90 శాతం సివిల్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. సీఎం నియోజకవర్గం కావడంతో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు జరుగుతున్నాయి. భవనం నిర్మాణం పూర్తయినంత మాత్రాన సరిపోదు. సీఎం విజన్‌ను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలంటే మిగిలిన 10 శాతం పనులు అత్యంత కీలకంగా మారాయి.

యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాల్సిన పనులివే :

పనుల వేగం కనిపిస్తున్నప్పటికీ, నియోజకవర్గ ప్రతిష్ట దృష్ట్యా ఈ పెండింగ్ పనులపై అధికారులు మరింత ఫోకస్ పెట్టాల్సి ఉంది. మౌలిక వసతులు: ఆసుపత్రికి నిరంతర విద్యుత్ మరియు మిషన్ భగీరథ నీటి సరఫరా కనెక్షన్ పనులు పూర్తి కావాలి. అప్రోచ్ రోడ్లు & డ్రైనేజీ ఆసుపత్రి ఆవరణలో డ్రైనేజీ నెట్‌వర్క్‌, అత్యవసర వాహనాల రాకపోకలకు వీలుగా సీసీ రోడ్ల నిర్మాణం తుది మెరుగులు దిద్దుకోవాల్సి ఉంది. ఆసుపత్రి ప్రాంగణం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. హైటెక్ హంగులు:వార్డుల వారీగా ఫర్నిచర్ మరియు ప్రాణాలను కాపాడే అత్యాధునిక వైద్య పరికరాల అమరిక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.

సిద్ధంగా ఉన్న DME వైద్య బృందం

సీఎం ప్రత్యేక చొరవతో కొడంగల్ కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ వైద్య బృందాన్ని (DME స్టాఫ్) కేటాయించింది. ప్రస్తుతం భవనం హ్యాండోవర్ కావాల్సి ఉండటంతో, వీరంతా తాత్కాలికంగా తాండూరులో విధులు నిర్వహిస్తూ శిక్షణ పొందుతున్నారు. భవనం సిద్ధం కాగానే వీరంతా కొడంగల్‌కు తరలిరానున్నారు.

సీఎం ప్రతిష్టకు నిదర్శనం

"ముఖ్యమంత్రి ఆశయం ప్రకారం.. ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించడమే మా లక్ష్యం. పనులు త్వరగా పూర్తి చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తాం" అని నియోజకవర్గ ఇంచార్జి తిరుపతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా, పనుల వేగాన్ని మరింత పెంచి త్వరలోనే ఈ 'వైద్య దేవాలయాన్ని' సామాన్యుడికి అంకితం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ తుది మెరుగులు పూర్తయితే కొడంగల్ ఆరోగ్య చిత్రపటం పూర్తిగా మారిపోనుంది.

Next Story