మునుగోడు ముడుపులు జిల్లాలో డంపింగ్​

by Disha Web Desk 20 |
మునుగోడు ముడుపులు జిల్లాలో డంపింగ్​
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : మునుగోడు ఉపఎన్నికలపై రాష్ట్ర, దేశ వ్యాప్తంగా పెద్ద చర్చసాగుతుంది. ప్రధానంగా ఈ ఉపఎన్నికల్లో మద్యం, నగదుపైనే రాజకీయ నేతలు దృష్టి సాధించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మునుగోడు ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోనున్న పార్టీలు విచ్చలవిడిగా డబ్బును, మద్యంతో ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉపఎన్నికలు జరుగుతున్న మునుగోడు ప్రాంతంలో స్ధానిక నాయకులంటే బయటి నుంచి వచ్చిన నేతలే ఆ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

అంతేకాకుండా స్ధానిక ఓటర్లకు రాచమర్యాదలు చేయడంలో పోటాపోటిగా పనిచేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లు కాస్లీ ఎన్నికలుగా మారబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఓటుకు రూ.20వేలకుపైన, కుటుంబానికి తులం బంగారమంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. ఆ మాటలను నిజం చేయాలనే ఆలోచనలో జాతీయ, రాష్ట్రీయ పార్టీలున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ పార్టీల అభ్యర్థుల విజయం కోసం ధనం, మధ్యం అనే ప్రవాహంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మునుగోడు నియోజకవర్గానికి అతి సమీపంలోనున్నాయి. అయితే మునుగోడు ఉపఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచేందుకు నాయకులు రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల, యాచారం, చింతపల్లి, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్ధుల్లాపూర్​ మెట్టు వంటి మండలాల పరిధిలో నివసిస్తున్న ప్రధాన పార్టీల నేతల ఇండ్లల్లో నగదును డంప్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆ ఇండ్లపై ఇంటలిజెన్స్​ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

నగదు పంపిణీ పైనే ప్రేమ...

రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలొచ్చిన ప్రజల సమస్యలు వదిలేసి డబ్బు, మద్యంపైనే చర్చ సాగుతుంది. దీంతో పార్టీల నాయకులు నగదు, మద్యం పంపిణీ పై పెట్టే దృష్టి ప్రజలు నిత్యం ఎదుర్కోనే ఇబ్బందులను పరిష్కరించడంలో విఫలమయ్యారు. అందుకు అనుగుణంగా ఓటర్లకు పంపిణీ చేసే నగదును ఏవిధంగా ఎన్నికలు జరిగే ప్రాంతానికి పంపిణీ చేయాలనే ప్రణాళికలు వేయడంలో సక్సెస్​ అవుతున్నారు. మునుగోడు ఉపఎన్నిలు జరిగే మర్రిగూడ, నాంపల్లి, చండూర్, గట్టుప్పుల్​, మునుగోడు, నారాయణపురం, చౌటుప్పల్​ మండలాల ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు పోటిలోనున్న ప్రధాన పార్టీలు సిద్దంగా ఉన్నాయి.

డబ్బులు ఆయా మండలాలకు చేరవేసేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. మర్రిగూడ, నాంపల్లి మండలాలకు అతి సమీపంలోనున్న మరో నియోజకవర్గం పరిధిలోని చింతపల్లి, యాచారం, మాడ్గుల మండలాల్లో నారాయణపురానికి మరో నియోజకవర్గంలోని మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో చౌటుప్పుల్ ప్రాంతానికి అబ్ధుల్లాపూర్​ మెట్టు మండలాల్లో ఆయా పార్టీల నేతల ఇండ్లల్లో డంప్​ చేసినట్లు తెలుస్తోంది. అధికారులు నగదు పంపిణీ కోసం చేసే ప్రయత్నాలపైనున్న పలు సమస్యలపై పట్టింపు లేకపోవడం బాధకరం.

​కోట్ల కట్టలు ముఖ్యనేతల ఇంట్లో...

రంగారెడ్డి జిల్లాలోని అబ్ధుల్లాపూర్​మెట్టు, యాచారం, మంచాల, మాడ్గుల, ఇబ్రహీంపట్నం, హయత్​నగర్​, సరూర్​నగర్​ మండలాల్లో నివాసముంటున్న ముఖ్యనాయకుల ఇండ్లల్లో పెద్ద ఎత్తున్న నగదును డంపింగ్​ చేసినట్లు సమాచారం ఉంది. ఇప్పటికే వీరి ఇండ్లు నిఘా నీడలోనున్నట్లు తెలుస్తోంది. ఇంటలిజెన్స్​ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రజలను అకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అంతేకాకుండా ఓటుకు డబ్బు ఇస్తామనే ప్రచారం జోరుగా చేశారు. ఇప్పుడు మునుగోడు ఓటర్లు డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తారనే ఆశలోనున్నారు.. కానీ సమస్యలు, విషయాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ ఆశలు రెకెత్తించిన పార్టీలు డబ్బు పంపిణీ చేయకపోతే ఎన్నికల్లో ఘోరమైన అవమానం జరిగే అవకాశం ఉందని నాయకులు తంటాలు పడుతున్నారు. ఈ డబ్బుల తరలింపుపై ఇటు నాయకులు, డబ్బుల పంపిణీ జరగకుండా అటు అధికారులు ఏవిధంగా వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే.



Next Story