- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదో తరగతిలో రంగారెడ్డి జోరు... కార్పొరేట్‌కు ధీటుగా ఫలితాలు
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. 2016 నుంచి వచ్చిన ఫలితాలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ....

దిశ, రంగారెడ్డి బ్యూరో: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. 2016 నుంచి వచ్చిన ఫలితాలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రైవేటు, కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు..అత్యధిక ఉత్తీర్ణతలు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 92.96 శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్ర స్థాయిలో 30వ స్థానంలో నిలిచింది.
బాలికలదే హవా
పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో బాలికలదే హవా కొనసాగింది. 27,611 మంది బాలురు పరీక్షలు రాయగా..25,205(91.29 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 25,335 మంది పరీక్ష రాయగా..24,012(94.78 శాతం)మంది పాసై పైచేయి సాధించారు. 2016 సంవత్సరం నుంచి 2018వరకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఆతర్వాత ప్రతి యేడు జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత పెరుగుతూ వస్తోంది. 2019 సంవత్సరంలో 92.83 శాతం ఫలితం రాగా..2022లో 90.04 శాతం ఉత్తీర్ణత వచ్చింది. 2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్ కారణంగా ప్రభుత్వం విద్యార్థులనందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఆతర్వాత జరిగిన మూడేళ్ల ఫలితాలతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణతా శాతం మెరుగుపడడం విశేషం. గత యేడాది రాష్ట్ర స్థాయి ర్యాంకు 31కాగా.. ఈసారి 30వ స్థానంలో జిల్లా నిలిచింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. 94.33 శాతం నుంచి 96.83 శాతంతో టాప్ 20లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. అలాగే జిల్లాలో 49 పాఠశాలలు 10 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఆధునిక విద్యాబోధనను అందించడంతోపాటు ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మధ్యాహ్న భోజనం వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసింది. వెనుకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహించడం వంటి చర్యల మూలంగా మెరుగైన ఫలితాలు రావడం.. ఈసారి పదో తరగతి పరీక్షల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆదర్శ పాఠశాలలు, కేజీవీబీ, గురుకుల పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు తాజా.. ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచారు.
జూన్ 5 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 5 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను విడుదల చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 30 నుంచి మే 15 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.






