బండి సంజయ్‌తో రాజగోపాల్ రెడ్డి భేటీ

by Disha Web Desk |
బండి సంజయ్‌తో రాజగోపాల్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో భేటీ అయ్యారు. మంగళవారం అంకిరెడ్డి గూడెం వద్ద బండి సంజయ్‌ని కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్ట్ 21న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో నిర్వహించే బహిరంగ సభ గురించి బండితో చర్చించానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పాదయాత్ర రూట్ మ్యాప్‌లో మార్పులు చేయాలని బండి సంజయ్‌ని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి నిధులు తేలేకపోయానని, తన రాజీనామాతోనైనా మునుగోడు అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు తాను కోట్ల రూపాయల సొంత నిధులను ఖర్చు చేశానని చెప్పారు. మునుగోడు ప్రజలకు తానంటే ఏంటో తెలుసని, వారంతా తన వెంటే ఉన్నారని కోమటిరెడ్డి అన్నారు.

గుత్తాపై గుస్సా

మునుగోడు ఉప ఎన్నికతో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై విమర్శలు, ఆరోపణలు చేసే ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్ని పార్టీలు మారాడో గుర్తుకు తెచ్చుకోవాలని చేరకలు అంటించారు. పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయకుండానే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి ప్రజలందరికీ తెలుసని, అలాంటి వ్యక్తి తనపై విమర్శలు చేయడం ఏంటని అన్నారు. తన నిజాయితీ, నిబంద్ధతను శంకించే స్థాయి గుత్తా సుఖేందర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి పార్టీ మారుతున్నానని, పదవికి రాజీనామా చేయకుండానే గుత్తా కండువా మార్చిన సంగతి మరువద్దని అన్నారు.


Next Story

Most Viewed