ఇడ్లీలోకి సాంబార్ కావాలని లొల్లి.. గొడవ ఎంత దూరం వెళ్లిందో తెలుసా?

by Disha Web Desk 2 |
ఇడ్లీలోకి సాంబార్ కావాలని లొల్లి.. గొడవ ఎంత దూరం వెళ్లిందో తెలుసా?
X

దిశ, పేట్ బషీరాబాద్: పొద్దు పొద్దున్నే వేడి వేడిగా టిఫిన్ చేద్దామని వచ్చారు. టిఫిన్‌లో సాంబార్ కావాలని అడిగారు. సాంబార్ లేదని చెప్పడంతో మాటా మాటా పెరిగింది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలు కావడంతో ఒకరిపై ఒకరు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్ మార్కెట్ రోడ్ ఆరంభంలో మున్నా లాల్ అనే వ్యక్తి గోకుల్ టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం టిఫిన్ సెంటర్‌కు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇడ్లీ తీసుకున్నారు. దానిలోకి సాంబార్ కావాలని అడిగారు. హోటల్ సిబ్బంది తమ వద్ద సాంబార్ లేదని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన యువకులు హోటల్ సిబ్బందితో గొడవపడ్డారు. ఈ క్రమంలో హోటల్‌లో పనిచేస్తున్న కాళిదాసు అనే వ్యక్తి తలపై అప్పడాల కర్రతో దాడి చేయడంతో అతని తలకి తీవ్రగాయమైంది. మరో వ్యక్తి ముఖానికీ గాయమైంది. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను స్టేషన్‌కు తరలించారు. కాగా, టిఫిన్ చేయడానికి వచ్చిన వారు "సాంబార్ అడిగినందుకు తమని దుర్భాషలు ఆడుతూ తమపై దాడి చేశారని" పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల ఎస్ఐ మన్మద్ జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నారు.



Next Story