సెలవుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి

by Disha Web Desk 12 |
సెలవుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : వేసవి సెలవుల్లోనే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్ పీసీ) నేతలు డిమాండ్ చేశారు. పాఠశాలల పునఃప్రారంభం లోపు ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించి, నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం యుఎస్ పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాఉ రాష్ట్ర విద్యా రంగంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు.

ఉపాధ్యాయుల బదిలీల జీవో పై హైకోర్టు స్టే కొనసాగుతున్నందున మొత్తం ప్రక్రియ నిలిచిపోయిందని, పాఠశాలల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పదోన్నతులు, నియామకాల ద్వారానే ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని, కనుక బదిలీలపై హైకోర్టు తీర్పు వచ్చేలోగా తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టాలని, తద్వారా ఏర్పడిన ఖాళీల్లో నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని యూఎస్ పీసీ నేతలు డిమాండ్ చేశారు.

ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించారని, సీపీఎస్ రద్దు వాగ్దానం చేసి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వారు గుర్తు చేశారు. అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు అందించాలన వారు డిమాండ్ చేశారు. ట్రెజరీల్లో ఆమోదం పొంది ఏడాదిగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని, బకాయి ఉన్న మూడు డీఏలు ప్రకటించాలన్నారు.

ఈ ఏడాది జులై 1 నుంచి నూతన వేతన సవరణ అమలు జరిగే విధంగా తెలంగాణ రెండో పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించారు. ఈ సమావేశంలో యూఎస్ పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎం సోమయ్య, లింగారెడ్డి, కొమ్ము రమేష్, యాదగిరి, జాడి రాజన్న, మేడి చరణ్ దాస్, భిక్షపతి, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.

Read More: అనుబంధ అధ్యాపకుల నియామకంలో గందరగోళం


Next Story