ప్రీతిది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యే: ప్రొ కోదండరామ్

by Disha Web Desk 19 |
ప్రీతిది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యే: ప్రొ కోదండరామ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చికిత్స పొందుతూ కన్నుమూసిన మెడికో విద్యార్థిని ప్రీతి మరణం అత్యంత బాధాకరం అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. ప్రీతి మరణం తన కుటుంబానికే కాకుండా ఈ సమాజానికే పెద్ద నష్టం అన్నారు. ప్రీతి లేని లోటును ఎవరు తీర్చలేరని ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రీతిది ఆత్మహత్య కాదని ఇది ముమ్మాటికి హత్యే అన్నారు. ప్రీతిని టార్గెట్ చేసి వేధించారని పోలీసులే చెబుతున్నారని.. ఇలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరం అన్నారు. విద్యాసంస్థల్లో వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలను టార్గెట్ చేస్తున్నారని ఇది మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలను నిర్మూలించేందుకు జాతీయ స్థాయిలో రోహిత్ వేముల చట్టాన్ని ప్రతిపాదించారని తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చట్టం గురించి ఆలోచన చేయాలన్నారు. ప్రీతి ఘటనకు దారి తీసిన పరిణామాలన్నింటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని టీజేఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పెంచాలని, కుటుంబ సభ్యులకు వీలైనంత త్వరగా ఉద్యోగానికి సంబంధించిన ఆర్డర్ ఇవ్వాలన్నారు. ఈ తరహాలో అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని వేధించడం రాష్ట్రంలో పెరిగిపోతున్నాయన్నారు. వరంగల్ నర్సంపేటలో బీటెక్ స్టూడెంట్ రక్షితను కూడా అదేపనిగా వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. ఈ రెండు ఘటనల్లో ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు.



Next Story