పోలీసులు ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి: ఎంపీ లక్ష్మణ్

by Disha Web Desk 12 |
పోలీసులు ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి: ఎంపీ లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అప్పటి నేతలు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెబుతుంటే.. కేటీఆర్ మాత్రం ఒక్కరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ అయి ఉండవచ్చని మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అవినీతి ఎక్కడ బయట పడుతుందోననే అభద్రతా భావంతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. బీఆర్ఎస్ నేతలు చేసిన దుర్మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒక్క అంశం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అవినీతిని బయటికి తీస్తామని సీఎం రేవంత్ చెప్పడమే కానీ.. పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసింది లేదని మండిపడ్డారు.

మేడిగడ్డ తో పాటు ధరణి, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూ కుంభకోణం పై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శలు గుప్పించారు. కొత్తగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చిందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అంశాలను తెర మీదకు తెస్తున్నారు తప్పితే.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేశారా? అని లక్ష్మణ్​ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిందని విరుచుకుపడ్డారు. ఉప ఎన్నికల సమయంలో కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కి మూల కారణం కేసీఆర్ అని కాంగ్రెస్ చెబుతోందని, అయితే దీని వెనుక ఉన్నవారెవరనేది బయటకు రావాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని లక్ష్మణ్​ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ విచారణకు ఆదేశించి తాను లీక్ వీరుడిని కాదని, గ్రీకు వీరుడినని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని సెటైర్లు వేశారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందో లేదో విచారణ జరిపి తేల్చాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed