ఓఆర్‌ఆర్‌ లీజు విధి విధానాలను బయటపెట్టాలి: తమ్మినేని డిమాండ్

by Disha Web Desk 7 |
ఓఆర్‌ఆర్‌ లీజు విధి విధానాలను బయటపెట్టాలి: తమ్మినేని డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓఆర్‌ఆర్‌ లీజు విధి విధానాలను బయటపెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన‌లో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులోని 158 కిలో మీటర్ల విస్తర్ణంలో వున్న నెహ్రూ ఔటర్‌ రింగ్‌రోడ్డును కేవలం రు.7380 కోట్లకు 30 ఏళ్లపాటు లీజుకిచ్చిందని పేర్కొన్నారు. ఈ లీజుకు ఇవ్వడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున తక్షణమే ఓఆర్‌ఆర్‌ లీజు విధివిధానాలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలని సీపీఎం పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాదుకు మణిహారంగా, ప్రజలకు సౌకర్యంగా, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న ఓఆర్‌ఆర్‌ను ముంబాయికి చెందిన ప్రైవేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం లీజుకివ్వాలని నిర్ణయించిందన్నారు.

రాష్ట్ర కేబినిట్‌లో 6 నెలల క్రితమే లీజు నిర్ణయం జరిగినా గోప్యంగా ఉంచిందని, ప్రతి యేటా పెరుగుతున్న ఓఆర్‌ఆర్‌ ఆదాయం మేరకు లీజు నిర్ణయం జరగలేదని, నిబంధనలేమీ పాటించలేదని, వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆర్థిక నిపుణులు, సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఆదానీ, అంబానీల లాంటి ప్రయివేట్‌, కార్పొరేట్‌ కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతున్నదన్నారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుకుంటామని, ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ తదితరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టకుండా చూడాలని, లీజుకు సంబంధించిన విమర్శలు వస్తున్నందున ఒప్పంద వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed