Harish Rao : తెలంగాణను కంటిరెప్పలా కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే : హరీష్ రావు

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది బీఆర్ఎస్(BRS) పార్టీ అని ఆ పార్టీ నేత హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు.

Harish Rao : తెలంగాణను కంటిరెప్పలా కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది బీఆర్ఎస్(BRS) పార్టీ అని ఆ పార్టీ నేత హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు. 2005లో పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల వంటి ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20ఏళ్ల క్రితం ఇదే రోజున మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతానికి నీటి హక్కులను కాలరాస్తాయని ఆరోపిస్తూ, కేసీఆర్(KCR) ఆదేశాల మేరకు రాజీనామాలు చేశామని అన్నారు. ఈ సంఘటన తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో.. ఆంధ్రప్రదేశ్ బనకచర్ల(Banakacharla) పేరిట గోదావరి నీళ్ల దోపిడి చేస్తానంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.

నాడైనా, నేడైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీసే ఏ కుట్రలనైనా తమ పార్టీ సహించదని పేర్కొన్నారు. పదవులకు రాజీనామాలు చేయడం మాత్రమే కాదు, పేగులు తెగేదాకా కొట్లాడతామని, తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపలా ఉంటామని, కంటికి రెప్పలా ఉండి కాపాడుకుంటామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు తోడ్పాటు అందిస్తున్నారని ఆరోపిస్తూ.. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతామని, ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తామని హెచ్చరించారు.

Next Story