పార్లమెంట్‌లో తగ్గనున్న కాంగ్రెస్ ఎంపీల సంఖ్య

by Disha Web Desk 2 |
పార్లమెంట్‌లో తగ్గనున్న కాంగ్రెస్ ఎంపీల సంఖ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు ఇక నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య తగ్గనున్నది. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానాలు నుంచి పోటీ చేయించేందుకు అభ్యర్ధుల కొరకు కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించనున్నది. ఈ టాస్క్‌ను కూడా సునీల్ కనుగోలుకు ఇచ్చినట్లు సమాచారం.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగానూ విజయం సాధించారు. హైకమాండ్ ఆదేశిస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. ఇక మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగానూ గెలిచారు. ఆ తర్వాత ఉత్తమ్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే, సీఎం అభ్యర్ధి పోటీలోనూ ఉన్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2019లో భువనగిరి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. సీఎం రేసులోనూ ఉన్నారు. అయితే హైకమాండ్ ఆదేశాల మేరకు పనిచేస్తామని ఇప్పటికే ఆ ముగ్గురూ నేతలు బహిరంగంగానే పేర్కొన్నారు.



Next Story