అక్రమార్కుల దగ్గరే గులాబీ నోట్లు.. నగల దుకాణాలకు పోటెత్తిన జనం

by Disha Web Desk 2 |
అక్రమార్కుల దగ్గరే గులాబీ నోట్లు.. నగల దుకాణాలకు పోటెత్తిన జనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ బ్యాంకులు, రిజర్వు బ్యాంకు బ్రాంచీల్లో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సామాన్య జనం భారీ స్థాయిలో వస్తారని పలు బ్యాంకులు ఏర్పాట్లు చేసుకున్నాయి. స్థానికంగా పోలీసుల సాయాన్ని కోరాయి. క్యూ లైన్ల కోసం ఏర్పాట్లు చేసుకున్నాయి. ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కేవలం వందల సంఖ్యలో మాత్రమే జనం వచ్చారని హైదరాబాద్‌లోని పలు బ్యాంకుల మేనేజర్లు తెలిపారు. సామాన్యుల దగ్గర రెండు వేల నోట్లు పెద్దగా లేవనేది స్పష్టమైందని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని జువెల్లరీ దుకాణాల్లో మాత్రం రోజువారీ సగటుకంటే రెట్టింపు స్థాయిలో బంగారం విక్రయాలు జరిగాయి. సంపన్నుల దగ్గర పోగుబడిన నోట్లు నగల దుకాణాలకు చేరుతున్నట్లు అర్థమవుతున్నది.

నగల దుకాణాల్లో జరిగిన మొత్తం విక్రయాల్లో దాదాపు సగం మేర రెండు వేల నోట్లతోనే జరిగినట్లు పంజాగుట్టలోని ఆర్గనైజ్డ్ జువెల్లరీ వ్యాపారి ఒకరు తెలిపారు. సికింద్రాబాద్‌లోని అన్ ఆర్గనైజ్డ్ దుకాణాల్లో భారీ స్థాయిలోనే రెండు నోట్లతో వ్యాపారం జరిగినట్లు తేలింది. రెండు లక్షల రూపాయల వరకు బంగారం కొనుగోళ్ళకు ‘పాన్’ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్), ఆధార్ కార్డు లాంటివి అవసరం లేకపోవడంతో చిల్లరగానే బిజినెస్ జరిగినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. సిటీ శివారు ప్రాంతాల్లోని భూముల కొనుగోళ్ళకు కూడా గణనీయంగా రెండు వేల నోట్లను వాడినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సూచనప్రాయంగా తెలిపారు. రాబోయే నాలుగు నెలల వరకూ రియల్ బిజినెస్ ఈ నోట్ల కారణంగా ఒక మేరకు కంటిన్యూ అయ్యే అవకాశముందని పేర్కొన్నారు.

సామాన్యులు కూడా నోట్లను వెంటనే మార్చుకోవాలన్న తొందర భావనతో లేరని, సెప్టెంబరు 30 వరకూ గడువు ఉండడంతో హడావిడి పడడంలేదని నల్లకుంటలోని ప్రైవేటు బ్యాంకు మేనేజర్ ఒకరు తెలిపారు. అకౌంట్‌లలో డిపాజిట్ చేసుకునేవారి సంఖ్య కూడా తాము అశించినంతగా లేదన్నారు. ఇన్సూరెన్సు, స్మార్ట్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ల రూపంలో టాక్స్ సేవింగ్స్ లాంటి పాలసీలు కొత్తగా నమోదవుతాయని తొలుత తాము భావించామని, ఆ తరహాలో రెస్పాన్స్ లేదన్నారు. కామన్ పబ్లిక్ దగ్గర ఈ నోట్లు లేవేమో అనే అనుమానం కూడా కలిగిందని, కానీ సెప్టెంబరు వరకు గడువు ఉన్నందున ఇప్పటికిప్పుడే ఒక అంచనాకు రాలేమన్నారు. ఆశించిన స్థాయిలో మాత్రం కామన్ పబ్లిక్ బ్యాంకులకు రాలేదని స్పష్టం చేశారు. రిజర్వుబ్యాంకు ప్రకటన తర్వాత జనంలోనూ టెన్షన్ లాంటి పరిస్థితి కనిపించలేదన్నారు.

మరోవైపు ఆన్‌లైన్ కామర్స్ వ్యాపారంలో మాత్రం ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఆప్షన్‌ను ఎంచుకునేవారి సంఖ్య రెండు రోజులుగా పెరిగింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటివి మాత్రమే కాక వంటగ్యాస్ సిలిండర్ల పేమెంట్లు కూడా ఇదే పద్ధతిలో జరుగుతున్నాయి. ఎక్కువగా రెండు వేల నోట్లతోనే పేమెంట్లు జరుగుతున్నాయి. జొమాటో ఫుడ్ యాప్ అధికారికంగానే ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం క్యాష్ డెలివరీ లావాదేవీల్లో 75% మేర రెండు వేల నోట్లే వస్తున్నాయని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. స్థానికంగా పెట్రోలు బంకుల్లోనూ రెండు వేల నోట్లు దర్శనమిస్తున్నాయి. ఇంతకాలం రూ. 500 నోట్లు కనిపించగా రెండు రోజుల నుంచి గులాబీ నోట్లు కనిపిస్తున్నాయి. హిమాయత్‌నగర్‌లోని భారత్ పెట్రోలు బంకు మేనేజర్ ఒకరు మాట్లాడుతూ, పెట్రోలు సేల్స్ పెరిగిందని, గులాబీ నోటుతో ఒకేసారి ఐదు లీటర్లు కొనేవారి సంఖ్య పెరిగిందన్నారు.

మార్కెట్‌లో సుమారురూ. 3.76 లక్షల కోట్ల మేర రెండు వేల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నట్లు రిజర్వు బ్యాంకు ఈ నెల 19న ప్రకటించింది. ఇప్పటివరకు ఏ మేరకు బ్యాంకులకు చేరాయన్న గణాంకాలను వెల్లడించకపోయినప్పటికీ ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో పెద్దగా డిపాజిట్లు, ఎక్ఛేంజి జరగలేదనే వార్తలు వెలువడ్డాయి. జువెల్లరీ, రియల్ బిజినెస్ లావాదేవీల్లో గులాబీ నోట్లే ఎక్కువగా కనిపిస్తుండడంతో సంపన్నులు నోట్ల మార్పిడి కోసం ఈ బాటను ఎంచుకున్నట్లు స్పష్టమవుతున్నది. కామన్ పబ్లిక్ దగ్గర నామమాత్రంగా ఉన్న రెండు వేల నోట్లు సంపన్నుల దగ్గర మాత్రం కట్టలకొద్దీ పేరుకుపోయినట్లు వచ్చిన వార్తలకు ఈ లావాదేవీలు బలం చేకూరుస్తున్నాయి.

Next Story

Most Viewed