నిజామాబాద్ లోనే పసుపు బోర్డు

by Disha Web Desk 15 |
నిజామాబాద్ లోనే పసుపు బోర్డు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో అత్యధికంగా పసుపు పండిస్తున్న రైతుల కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మోడీ వెంటపడి పసుపు బోర్డును సాధించారని, ప్రధానిగా మూడవసారి మోడీని , రెండవసారి ఎంపీగా అరవింద్ ని గెలిపిస్తే నిజామాబాద్ లోనే పసుపు బోర్డు ఏర్పాటవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ పసుపు బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చేయడం, వెనువెంటనే కేంద్ర గెజిట్ రావడం జరిగిన విషయం తెల్సిందే అన్నారు. అయితే పసుపు బోర్డు ఎక్కడ అనే విషయంపై సందిగ్ధానికి హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తామని తెరదించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీని కార్నర్ చేస్తూ జరుపుతున్న రాజకీయాలకు అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో చెక్ పెట్టారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో విశాల జనసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా

ఉన్న బీడీ కార్మికుల శ్రేయస్సు కోసం ఆసుపత్రిని నిర్మిస్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో మూతబడిన బోధన్ చక్కెర కర్మాగారాన్ని రైతుల సహకారంతో సహకార పద్ధతిలో తెరిచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. మోడీని ప్రధాని చేయాలని ఉందా అయితే నిజామాబాద్ ఎంపీగా రెండవసారి ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని కోరారు. ఇవి మోడీ గ్యారెంటీ అన్నారు. త్రివేణి సంగమ క్షేత్రమైన ఇందూర్ లో రెండోసారి బీజేపీని గెలిపించేందుకు అందరూ సంకల్పం తీసుకోవాలని అన్నారు. ప్రధానిగా

మోడీ మూడవ సారి అధికారంలోకి రావాలన్నా, ధర్మపురి అరవింద్ రెండోసారి గెలవాలన్నా ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా పార్లమెంట్ పరిధిలో వెలుగు చూసిన పీఎఫ్​ఐ మూలాలను సమూలంగా పెరికి వేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడుతుందని, మోడీ అలాంటి వాటిని లెక్క చేయరని, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని, వారికి ఓటుతో బుద్ధి చెబుతారని అమిత్ షా అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కోసం ముస్లింలకు వెట్టి చాకిరి చేస్తోంది : బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్

పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉన్న హిందువులకు భారతదేశం పౌర సత్వం ఇస్తామని బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని, అది వారి ఓటు బ్యాంక్ కోసం ముస్లింలకు వెట్టి చాకిరి చేస్తుందని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. విశాల జనసభలో అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని, ప్రధాని మోడీ బ్రతికున్నంత వరకు వారి రిజర్వేషన్లు తొలగించడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రచారమని కొట్టి పారేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఆలిఘడ్, జమియా ముస్లిం మైనార్టీ యూనివర్సిటీలుగా మార్చి అక్కడ దళితులు, గిరిజనుల, బీసీల రిజర్వేషన్లను రద్దు చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి హయాంలో

రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఉస్మానియా, హైదరాబాద్ యూనివర్సిటీలను కూడా మైనార్టీ యూనివర్సిటీలుగా మారుస్తారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో దేవతల పేరు పెట్టి దేవుళ్ల మీద ఒట్టు వేసి మోసం చేసిందన్నారు. రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను అక్రమంగా నివసించిన వారిని దేశం నుంచి తరిమివేడయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటన్నారు. త్రిబుల్ తలాక్ తో ముస్లిం మహిళలు మౌనంగా ఉన్నారని, మియాబీబీలు ఒక్కటయ్యారని అన్నారు. ఎన్ ఆర్ సీ, అర్టికల్ 371, యూనియన్ సివిల్ కోడ్ లపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన అభిప్రాయాన్ని తెలపాలని అరవింద్ డిమాండ్ చేశారు.

బీజేపీ హయాంలో రామ మందిర నిర్మాణం పూర్తి చేశామని, మూడవసారి నరేంద్ర మోడీ ప్రధాని ఐతే మధుర, కాశీలో ఆలయాను నిర్మించి తిరుతామన్నారు. ముస్లింల కోసం కాంగ్రెస్ పార్టీ గాడిద చాకిరి చేస్తుందని అన్నారు. ఒకప్పుడు గల్ప్ దేశాలలో హిందువుల పూజలు నిషేధం అని, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత అక్కడ ఆలయాల నిర్మాణం జరిగాయన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన అమలు కాని ఆరు గ్యారంటీలలో ఒక్కటైనా అమలు అవుతుందా అని ప్రశ్నించారు.

కాషాయ వర్ణమైన ఇందూర్....

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అరవింద్ ను గెలిపించేందుకు ప్రచారానికి రావడంతో ఇందూర్ నగరం కాషాయ వర్ణమైంది. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానం మొత్తం కషాయ జెండాలతో, ఫ్లెక్సీలతో, హోర్డింగ్ లతో అలంకరించారు. అమిత్ షా వచ్చిన తరువాత జై శ్రీరాం నినాదాలతో ప్రాంగణం దద్ధరిల్లింది. ఈ సభలో జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్, రాష్ర్ట ఉపాధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ, కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్య నారాయణ, పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed