జోరుగా జీరో ఇసుక..

by Disha Web Desk 20 |
జోరుగా జీరో ఇసుక..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి మంజిరా నదులు ప్రవహిస్తున్న ఇసుక రీచ్ లలో తవ్వకాలకు ఇటీవల టీఎస్ ఎండీసీ టెండర్లు నిర్వహించిన దాఖలాలు లేవు. ఉన్నదల్లా డెవలప్ మెంట్ పనులకు ముఖ్యంగా డబుల్ బెడ్ రూం పనులకు, బ్రిడ్జిల నిర్మాణ పనులకు అధికారులు ఇసుకను తవ్వకాలకు అనుమతిచ్చారు.

అదీకూడా ప్రతివారంలో ఒకటి, రెండు రోజులు పరిమితి లోపల తవ్వకాలకు అనుమతి ఉంది. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం నిర్మాణ పనులు ఎన్నడో అటకెక్కాయి. గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో ఇసుక తవ్వకాలు జీరోగా సాగుతున్నాయి. ఏకంగా మిషన్లు పెట్టి తవ్వకాలు జరుగుతున్నా ఎలాంటి పర్మిట్ లేకుండా ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.

నిజామాబాద్ సరిహద్దులోనూ మంజిరా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. టీఎస్ ఎండీసీ అనుమతులు లేకున్నా ఒక ప్రజాప్రతినిధి కనుసన్నుల్లో ఇసుకను తవ్వేస్తున్నారు. బోధన్ డివిజన్ లోని హున్సా, మందర్నా, ఖద్ గాం, రెంజల్, శాటాపూర్ ప్రాంతాల్లోని నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకను తవ్వేస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ల ముందు నుంచి జీరోగా ఇసుకను తరలిస్తున్నారు. రెవెన్యూ శాఖ చూసి చూడనట్లు వ్యవహరిస్తుండగా వారికి పోలీసు శాఖ తోడైంది.

దాంతో జీరోలో ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి. దాంతో తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఇసుక తవ్వకాల ద్వారా రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది. ఒక్కొక్క ఇసుక లారీకి రూ.7 వేల వరకు పన్నులు నష్టపోతుంది. కానీ ప్రజాప్రతినిధి కనుసన్నుల్లో ఇసుకను తవ్వకాలు చేస్తుంటే రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో అధికారికంగా ఇసుకను వే బిల్లులు, ఇతర పన్నులు చెల్లించి ఇసుక దందా చేస్తున్న వారికి పూడ్చలేని నష్టాన్ని చేకూరుస్తుంది.

నిజామాబాద్, బోధన్ లాంటి ప్రాంతాలకు నిత్యం పదుల సంఖ్యలో లారీలు, టిప్పర్లలో ఇసుక రవాణా వల్ల ఉపాధి లేకుండా పోతుందని నిజామాబాద్ లారీ ఓనర్స్ బిల్డింగ్ మెటీరియల్స్ వెల్పేర్ అసోసియేషన్ వాపోయింది. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనర్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో నిర్మాణ పనులు జరుగుతున్నా అధికారికంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకపోవడంతో కాళేశ్వరం ఇసుకను ఇక్కడికి తరలించి అమ్మకాలు సాగిస్తున్నారు. క్వారీల వద్ద టన్నుకు రూ.500 చొప్పున చెల్లించి కొనుగోలు చేసి వ్యయప్రయాసాలకు ఓర్చి వే బిల్లులు, ఇతర పన్నులను చెల్లించి ఇసుకను నిజామాబాద్ తరలిస్తే జీరోలో వచ్చే ఇసుక తక్కువ ధరకు లభిస్తుండడంతో తమ ఇసుకను ఎవరు కొనుగోలు చేయడం లేదని నిజామాబాద్ లారీ ఓనర్స్ బిల్డింగ్ మెటీరియల్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆరోపిస్తుంది.

దానికి తోడు గోదావరి, మంజిరా నదులు నిజామాబాద్ కు 40 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో గంటన్నర వ్యవధిలో ఇసుక చేర్చుతుండడంతో జీరోకు డిమాండ్ పెరిగి తమ ఉపాధికి, ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని వారు వాపోతున్నారు. ప్రజాప్రతినిధి, అతని తమ్ముడు కనుసన్నుల్లో జీరో ఇసుక బోధన్, నిజామాబాద్ రహదారులపై పరుగులు తీస్తున్నా బోధన్ డివిజన్ లో పోలీసులు పట్టించుకోకపోవడానికి ప్రజాప్రతినిధి ఒత్తిడే కారణమని సమాచారం. ఇసుక దందా, ఇసుక రీచ్ లలో సదరు ప్రజాప్రతినిధి వాటాలు అడుగుతుండడంతో గోదావరి, మంజిరా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు ఇసుక కాంట్రాక్టర్లు మొగ్గు చూపడం లేదు.

మొన్నటికి మొన్న మహారాష్ట్రలో తెలంగాణ వాసులు మంజిరా పరివాహక ప్రాంతంలో నాలుగు ఇసుక రీచ్ లలో టెండర్లు దక్కించుకున్నా తనకు వాటా ఇవ్వలదని, తనకే ఇసుక రీచ్ లు ఇచ్చేయాలని డిమాండ్ చేసి వ్యాపారులు ససేమీరా అనడంతో తెలంగాణకు రాకుండా అడ్డుకుంటున్న విషయం బహిర్గతమైంది. ఇప్పుడు ఎలాంటి రీచ్ లలో తవ్వకాలకు అనుమతి లేకున్నా ప్రజాప్రతినిధి అన్నా అధికారంతో జీరో ఇసుకను నడుపుతున్నాడని జిల్లా అంతా కోడైకూస్తుంది.


Next Story

Most Viewed