తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రతి పల్లెకు చాటి చెప్పాలి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Disha Web Desk 1 |
తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రతి పల్లెకు చాటి చెప్పాలి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ, కామారెడ్డి రూరల్ : తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రతి పల్లెకు చాటి చెబుతూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దశాబ్ధి ఉత్సవాల్లో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని అందరూ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.

జూన్ 2 న పతాకావిష్కరణ, దశాబ్ధి ఉత్సవ సందేశంతో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22న అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలన్నారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలన్నారు.

రాష్ట్రం ఏర్పాటు లాగే కామారెడ్డి జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. అదే విధంగా నూతన మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్య వ్యవస్థ కోసం జరుగుతున్న కృషిని, మన ఊరు- మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలని పేర్కొన్నారు.

కామారెడ్డికి మెడికల్ కాలేజ్, బాన్స్వాడలో నర్సింగ్ కళాశాల, వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా సాగునీటి చెరువుల పునరుద్ధరణ, గ్రామాల్లో చెక్ డ్యాంలు, ఊట చెరువుల నిర్మాణం తో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. జూన్ 19న జరిగే తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జడ్పి చైర్ పర్సన్ శోభ, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డీ.ఎఫ్. వో నిఖిత, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఎంపీపీ, జడ్పీటీసీ లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed