టీచర్లకు సెలవులివ్వొద్దు..

by Disha Web |
టీచర్లకు సెలవులివ్వొద్దు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు సెలవులు ఇవ్వొద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన డీఎస్ఇ సమావేశంలో డీఈవోలకు సూచించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీల నేపథ్యంలో హెచ్‌ఎంలు, టీచర్లకు సెలవులివ్వొద్దని తెలిపింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సీసీఏ రూల్‌ 1991 ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయులు నిత్యం హైదరాబాద్‌ వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సెలవుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం సూచనల మేరకు బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వొద్దని కొన్ని జిల్లాల్లో డీఈఓలు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయొద్దని మంగళవారం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఇచ్చిన ఉత్తర్వులు ఆర్సీ. నం.ఎస్పీఎల్/బీ5/2023 లను వెంటనే నిలుపుదల చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలయ్య, రాజన్న శాఖ పక్షాన విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైనప్పుడు ఉపాధ్యాయులు సెలవులను వినియోగించుకోవడం అనేది ప్రభుత్వం కల్పించిన సౌలభం. సెలవులు ఇవ్వకూడదని ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. అత్యవసర సమయంలో కుటుంబ అవసరాలకు ఆరోగ్య సమస్యలకు ఇతరత్ర అనేక సందర్భాలలో ఉపాధ్యాయులు తమకున్న సెలవులను నిబంధనలకు లోబడి వినియోగించుకుంటారు. కాబట్టి డీఇఓ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కోరారు.

ఉపాధ్యాయుల స్వేచ్ఛ, సీఎల్ పెట్టు కొనే హక్కు లేకుండా డిఎస్ఇ ఆదేశాలు మౌఖిక ఇవ్వడం దానికి అనుబందం గా జిల్లా విద్యా శాఖాధికారులులు సెలవులు ఇవ్వద్దు అంటూ మండల విద్య శాఖాధికారులకు , ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయడాన్ని తెలంగాణ ఉపాధ్యాయ యూనియన్ టీటీయు తీవ్రంగా ఖండించింది. ఇట్టి అదేశాలు వెంటనే రద్దు చేయాలని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంట జలంధర్, లాఠీకర్ రాము డిమాండ్ చేశారు.


Next Story