సీఎంఆర్ బియ్యం పక్కదారి పై చర్యలేవి..?

by Web Desk |
సీఎంఆర్ బియ్యం పక్కదారి పై చర్యలేవి..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కొరకు రైసుమిల్లులకు అప్పగిస్తే వారు వాటిని తెగ నమ్ముకుంటారు. కాదు కూడదు అనుకుంటే రీసైక్లింగ్ ద్వారా సేకరించిన బియ్యాన్ని అంటగడతారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో తిరిగి చెల్లించవలసిన ధాన్యాన్ని నెలల తరబడి ఉంచుకోవడం వారికే చెల్లింది. ధాన్యం సేకరణలో ఎప్పుడు రాష్ట్రంలో ఒకటి రెండు స్థానాల్లో ఉండే నిజామాబాద్ జిల్లాలో జరిగే సీఎంఆర్ కేటాయింపులు, రికవరీ లో జరిగే నిత్య తంతు. ఎందుకంటే ఈ తంతు గురించి జిల్లా కలెక్టర్ మొదలుకుని జిల్లా సివిల్ సప్లై అధికారి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ వరకు జగమెరిగిన సత్యమే. ప్రతి యేడాది రెండు సీజన్లలో రైసుమిల్లులు రూపాయి ఖర్చు చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఇష్టారీతిన వాడుకోవడం, వారికి నచ్చినప్పుడు తిరిగి చెల్లించడం ద్వారా వారు చేసే అక్రమాలు అన్నీఇన్నీ కావు. దొరికితే దొంగ లేకపోతే దొర అన్న చందంగా ఈ దందా జరుగుతుంది.

నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ మండలం లో రైస్ మిల్ కు కేటాయించిన 650 బస్తాల బియ్యం ఎలాంటి అనుమతులు లేకుండా రహదారి కెక్కాయి. డీఎస్ వో , డీసీఎస్‌వోలు హైదరాబాద్ వెళ్తుండగా ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పదంగా ఉన్న లారీని పట్టుకోవడంతో ఈ వ్యవహరం బట్టబయలైంది. రైస్ మిల్ యజమానిదని ఒక లారీలో 650 బస్తాలలో 300 క్వింటాళ్ల ధాన్యం ను గుర్తించి కేసు నమోదు చేశారు. సాధారణంగా, స్థానికంగా ఉండే తహశీల్దార్, పోలీసులు, సివిల్ సప్లయ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకుంటే కేసు తారుమారు అయ్యేదని ఆరోపణలు ఎప్పుడైనా సర్వసాధారణం. ఏకంగా జిల్లా స్థాయి అధికారులు పట్టుకోవడంతో సంబంధిత రైస్ మిల్ పై కఠిన చర్యలు తీసుకుంటారని అందరూ అనుకుంటారు.

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద 300 క్వింటాళ్ళతో పట్టుబడ్డ ధాన్యం లారీ ధర్పల్లి కి చెందిన రైస్ మిల్ వ్యాపారిదని అధికారుల విచారణలో తేలింది. దీనిపై విచారణ జరిపిన జిల్లా పౌరసరఫరాల కలెక్టర్ ఫెనాల్టీ విధించి వదిలేసినట్లు తెలిసింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి, సిరికొండ, డిచ్ పల్లి, ఇందల్వాయి మండలాల్లోని రైస్ మిల్లులకు ఈ ఖరీఫ్ సీజన్ లో సామర్థ్యానికి మించి ధాన్యంను మిల్లింగ్ కొరకు కేటాయించారని ఆరోపణలున్నాయి. కొందరు సివిల్ సప్లయ్ శాఖలోని అధికారులే మిల్లర్లతో మిలాఖత్ అయి పని చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. టోల్ ప్లాజా వద్ద పట్టుబడ్డ లారీ ధాన్యంను ఇతర మిల్లుకు తీసుకుపోయి మిల్లింగ్ కోసం తీసుకెళ్తున్నట్లు విచారణలో చెప్పినట్లు తెలిసింది. అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ధాన్యం తాలూకు రైస్ మిల్ యాజమాన్యం లైసెన్సులు రద్దు చేయకపోవడం, సీఎంఆర్ కేటాయింపులో బ్లాక్ లిస్టులో పెట్టకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి యేడాది సీజన్ వారీగా జరిగే తంతులో జిల్లా అధికారులు కూడా పాలవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.





Next Story

Most Viewed