పాక్‌లో ఏడుగురు కార్మికుల కాల్చివేత.. నిద్రలో ఉండగానే హతమార్చిన దుండగులు

by Dishanational2 |
పాక్‌లో ఏడుగురు కార్మికుల కాల్చివేత.. నిద్రలో ఉండగానే హతమార్చిన దుండగులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ పోర్ట్ సమీపంలోని నివాస గృహాలపై గురువారం తెల్లవారుజామున విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆ టైంలో నిద్రిస్తున్న ఏడుగురు కార్మికులు మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఖనేవాల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా స్థానికంగా ఓ షాపులో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వ్యక్తిని, మృత దేహాలను గ్వాదర్ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై బలూచిస్థాన్ సీఎం మీర్ సర్ఫరాజ్ బుగ్తీ స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బహిరంగ ఉగ్రవాదంగా అభివర్ణించారు. నిందితులను వదిలిపెట్టమని హెచ్చరించారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తులను కూడా విడిచిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. బలూచిస్తాన్ హోం మంత్రి మీర్ జియా ఉల్లా లాంగౌ మాట్లాడుతూ అమాయక కార్మికులను చంపడం పిరికి చర్య అని అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.

కాగా, బలూచిస్థాన్‌లో ఇటీవల తీవ్రవాద దాడులు ఎక్కువయ్యాయి. ఈ నెల 4న కూడా ఇదే ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుడులో సీనియర్ జర్నలిస్టుతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అలాగే గత నెల నుస్కి జిల్లాలో రెండు వేర్వేరు ఉగ్రదాడి ఘటనల్లో 11 మంది మృతి చెందారు. అంతేగాక మార్చి 20న, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై ముష్కరుల బృందం దాడి చేయగా భద్రతా బలగాలు దానిని అడ్డుకున్నాయి. దీంతో వరుస ఉగ్రఘటనల నేపథ్యంలో బలూచిస్థాన్ ప్రావీన్సు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story

Most Viewed