బోధన్‌లో ఎలాంటి విగ్రహాలు పెట్టడం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే షకీల్

by Web Desk |
బోధన్‌లో ఎలాంటి విగ్రహాలు పెట్టడం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే షకీల్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మైసూర్ పులి టిప్పు సుల్తాన్, మజ్లీస్ పార్టీ వ్యవస్థాపకులు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ విగ్రహాలను పెట్టడం లేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ క్లారిటీ ఇచ్చారు. ఇస్లాం మతంలో విగ్రహారాధాన లేదని, మతపెద్దల సూచనల మేరకు విగ్రహాల ఏర్పాటును విరమించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెలుగు, ఉర్దూలో ఆయన వీడియోలో మాట్లాడుతూ.. సోషల్ మీడియలో పోస్టు చేశారు. బోధన్‌లో పర్యటనలో ఉన్నప్పుడు ఈనెల 3న బోధన్ పట్టణంలో టిప్పు సుల్తాన్, మజ్లీస్ పార్టీ వ్యవస్థాపకుల విగ్రహావిష్కరణ చేయనున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో బీజేపీ నాయకులు మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ చేసిన అరాచకాలు, దాడుల గురించి తెలిసి ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు విగ్రహావిష్కరణ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు బోధన్ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ ప్రకటన పట్ల మండిపడ్డారు. అంతేగాక, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య సోషల్ మీడియాలో యుద్ధానికి దారి తీసింది. చివరకు మతపెద్దల సూచనలతో ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ ప్రకటన జారీ చేయడంతో విగ్రహాల ఆవిష్కరణ వివాదానికి ముగింపు పలికినట్లయింది.



Next Story