గంజాయి, డ్ర‌గ్స్ మ‌ద్యానికి అడ్డాగా మినీ ట్యాంక్ బండ్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఆర్మూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్ బండ్ కాంగ్రెస్

గంజాయి, డ్ర‌గ్స్ మ‌ద్యానికి అడ్డాగా మినీ ట్యాంక్ బండ్
X

దిశ‌, ఆర్మూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్ బండ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధ్వంసం అయిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన జనతా గ్యారేజ్ లో ఈ మినీ ట్యాంక్ బండ్ దుస్థితి పై అరుంధతి నగర్ వాసులు పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మాజీ జీవన్ రెడ్డి మల్లారెడ్డి మినీ ట్యాంక్ బండ్ ధ్వంసం, అక్కడి విలువైన వస్తువుల చోరీ పై క్రైం నెంబర్-8గా నమోదు చేసి గురువారం ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి ’నమస్తే ఆర్మూరు' కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ ను సందర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ సహకారంతో తాను పగలనక, రాత్రనక శ్రమించి చెరువు చుట్టూ అభివృద్ధి చేసిన ట్యాంక్ బండ్ నేటి దుస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆలనాపాలనా లేక అధోగతి పాలైన ట్యాంక్ బండ్ సుందరీకరణ నేడు కనుమరు గైందన్నారు. మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధిలో భాగంగా అందంగా అలంకరించిన గ్రానైట్ రాళ్లను పెకిలించి ఎత్తుకెళ్లారని, రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల దొంగతనం జరిగిందని, పదేళ్ళపాటు తమ ప్రభుత్వ హయాంలో పెంచిన చెట్లను నరికి వేశారని జీవన్ రెడ్డి అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కనిపించడం లేదని, ట్యాంక్ బండ్ ప్రాంతమంతా చెత్తా చెదారంతో నిండిపోయి కంపు కొడుతోందని, పట్టణ పౌరులు వ్యాయామం చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను నాశనం చేశారని, ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన ముళ్ల పొదలే కనిపిస్తున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

మల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్ బండ్ ఏరియా గంజాయి, డ్రగ్స్, మద్యానికి అడ్డాగా మారిందని, మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎక్కడ చూసినా తాగిపడేసిన మద్యం సీసాలే పడి ఉన్నాయని చెప్పారు. ఈ మినీ ట్యాంక్ బండ్ రెండేళ్లలో ఎలాంటి ఆలనాపాలనా లేక డంపింగ్ యార్డు గా మారి దుర్గంధం వెదజల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. టూరిజం అభివృద్ధి కోసం తెప్పించిన పడవలను కూడా ఎత్తుకెళ్ళి అమ్ముకున్నారని పేర్కొంటూ ఇంత మోసం జరుగుతున్నా ఆర్మూర్ మునిసిపల్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని మురికి నీరంతా మల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ లోకి వదులుతున్నారని, దీంతో ఈ ట్యాంక్ బండ్ లోని నీరంతా కలుషితంగా మారిందన్నారు. దుర్గంధం భరించలేక నరకం చూస్తున్న అరుంధతి నగర్ వాసులు జీవన్ రెడ్డి జనతా గ్యారేజ్ లో పిర్యాదు చేశారని, దీనిపై స్పందించి తాను ’నమస్తే ఆర్మూరు' కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించానని తెలిపారు. మున్సిపాలిటీ పని తీరుపై మండిపడ్డారు. సమస్య ఎక్కడుంటే తాను అక్కడుంటానని, ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు శాపమని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిప‌ల్ శాఖను నిర్వహిస్తున్న రాష్ట్రంలోని పురపాలక సంఘాలు ఇంత సర్వనాశనం కావడం సిగ్గు చేటు అని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, నాయకులు పోల సుధాకర్, శ్యామ్, జన్నెపల్లి రంజిత్ పాల్గొన్నారు.

Next Story