భవిష్యత్తులో ఇండ్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి తప్పదా...!

by Disha Web Desk 20 |
భవిష్యత్తులో ఇండ్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి తప్పదా...!
X

దిశ, భిక్కనూరు : చెరువు నీళ్లు కలుషితమై.... వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. అయినా నేతల్లో చలనం లేదు.. కనీసం తాగేందుకు వాడుకునే మంచినీళ్లు కూడా ఎర్రరంగు కలిపిన నీళ్ళలా సరఫరా అవుతుంటే వాటిని ఎట్లా తాగేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కాలంగా చెరువు నీళ్లు కలుషితమై భిక్కనూరు పట్టణ శివారులో ఉన్న రసాయనిక పరిశ్రమ ద్వారా విడుదలవుతున్న వ్యర్ధాలు, కెమికల్ నీళ్లు, పరిశ్రమ సమీపంలో ఉన్న కాచాపూర్ పెద్ద చెరువులోకి వెళ్లి, నీళ్లు కలుషితమై నల్లగా రంగు మారాయి. అప్పటినుంచి చెరువులో వేసిన లక్షల రూపాయల విలువ చేసే చేపలు మృత్యువాతకూడా పడ్డాయి. దీంతో మత్స్యకారులు అప్పట్లో ఆందోళన చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లా రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లగా నామమాత్రంగా స్పందించి వదిలేశారు తప్పితే, పరిశ్రమ వ్యర్థాల వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయని నిర్ధారణకు వచ్చినా, ఏమీ చేయలేని నిస్సహాయస్థితి అధికారుల వంతైంది.

క్రమంగా చెరువు కింద ఉన్న బోర్లతో పాటు చుట్టుముట్టు గ్రామాల బోర్ల నీళ్లు సైతం కలుషితమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. నీళ్లు కలర్ ఫుల్ గా మారి గ్రామస్తులు అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉన్నా, అటు ప్రజాప్రతినిధులు గాని, ఇటు ముఖ్యనాయకులు గాని, స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు, మేధావులు, గ్రామస్తులు ఇకనైనా మేల్కోవలసిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. లేకపోతే గ్రామంలోని ఇండ్లను భవిష్యత్తులో వదిలి పెట్టి సుదూర ప్రాంతాలకు ఖాళీ చేసి వెళ్లాల్సిన దౌర్భాగ్యపరిస్థితి తలెత్తకముందే జాగ్రత్త పడాలని, లేకపోతే మనంతట మనమే గొయ్యి తవ్వుకోవలసిన పరిస్థితి తలెత్తనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సబ్ స్టేషన్ లో ఉన్న కుళాయిలో తాజాగా రంగు మారిన నీళ్లు సరఫరా కావడం పట్ల సబ్ స్టేషన్ సిబ్బంది కంగుతిన్నారు. సాధ్యమైనంతవరకు రంగు మారిన ఆ నీటిని తాగకూడదని చైతన్యవంతులైన కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడం వల్ల గ్రామస్తులను ఆలోచనలో పడేలాచేసింది.



Next Story