"బెల్ట్" మళ్లీ ఓపెన్... యధావిధిగా గ్రామాల్లో మద్యం అమ్మకాలు షురూ..

by Disha Web Desk 20 |
బెల్ట్ మళ్లీ ఓపెన్... యధావిధిగా గ్రామాల్లో మద్యం అమ్మకాలు షురూ..
X

దిశ, భిక్కనూరు : మద్యానికి బానిసలైన ఎంతోమంది చేసిన కష్టాన్నంతా బెల్ట్ షాపులకు ఖర్చు చేస్తూ, పీకలదాకా తాగుతూ కుటుంబ సభ్యులను రోడ్డు కీడుస్తూ... మత్తులో జోగుతూ ఎక్కడపడితే అక్కడ సోయి తప్పి పడిపోతున్న దృశ్యాలు గ్రామాల్లో నిత్యకృత్యమయ్యాయి. ఉదయం లేవగానే మొహం కడిగి చాయి తాగే అలవాటు ఉండేది. కానీ ప్రస్తుతం పల్లెల్లో బెల్ట్ షాపులకు వద్దకు వెళ్లి మందు బాటిల్ కొనుగోలు చేసి అదే మందుతో అక్కడే మొహం కడుక్కోవడం రివాజుగా మారింది. చాలా గ్రామాల్లో ఉదయం పూట చాయి ప్రియులు హోటళ్ల వద్ద కూర్చునేవారు. తెల్లవారితే చాలు మద్యానికి బానిసైన పలువురు బెల్ట్ షాప్ ల వద్దకు వెళ్లి, ఎప్పుడు తెరుస్తారా...? అన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. వీరి వీక్నెస్ ను క్యాచ్ చేసుకున్న పలువురు బెల్ట్ షాప్ యజమానులు ఉద్దెర కూడా ఇస్తూ ఒకటికి రెండు రాసిపెట్టినా కిమ్మనకుండా వెళ్తున్నారు.

ఇంకొందరు చాటుమాటుగా ఇంట్లో నుంచి బెల్ట్ షాప్ వద్దకు చేరుకొని క్వార్టర్ విస్కీ, కొనుగోలు చేసుకొని అక్కడే విప్పి వాటర్ ప్యాకెట్ నీళ్ళు పోసి గుట గుట తాగేసి ఏర్పడకుండా తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. కూలీ పని తో పాటు వివిధ రకాల పనులకు వెళ్లేవారు సైతం కొందరు మధ్య మధ్యలో పని వదిలేస్తూ, షాపు వద్దకు చేరుకొని మళ్లీ ఒక క్వార్టర్ కొట్టి పనిలో జాయిన్ అవుతున్నారు. కిక్కుఎక్కకపోతే పనిచేయడం వారి వల్ల కాలేకపోతుండడంతో ఓ క్వార్టర్ మందు కొట్టొచ్చి మళ్లీ పనిలో జాయిన్ అవుతున్నారు. పనులు ముగించుకొని వచ్చి సీదా బెల్ట్ షాప్ వద్దకి చేరుకుంటున్నారు. వచ్చి, కూలీ చేయగా వచ్చిన డబ్బులను గ్రామాల్లో కొందరు బెల్ట్ షాపుల లో ఖర్చు చేస్తుండగా మరికొందరు పర్మిట్ రూం లో కూర్చొని, జేబులో ఉన్న డబ్బులను ఖర్చు చేసుకొని ఉత్త చేతులతో ఇంటికి తిరిగొ స్తున్నారు.

ఆ కుటుంబాల్లో రోజు తగాదాలే...

పొద్దంతా కాయ కష్టం చేసుకుంటేనే పూట గడవడం కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, కష్టం చేసి ఉన్నదంతా తాగుడుకు ఖర్చు చేస్తుండడం వల్ల ఆయా కుటుంబాల్లో తగాదాలు నిత్య కృత్యమయ్యాయి. తాగేందుకు చేతిలో డబ్బులు లేక భార్యతో గొడవ పడడం, ఉన్న విలువైన వస్తువులను ఇంట్లో నుంచి తీసుకెళ్లి విక్రయించడం, ఆ విధంగా వచ్చిన డబ్బులను తాగుడుకు ఖర్చు చేస్తూ, కుటుంబ సభ్యులను పస్తులుంచే పరిస్థితికి తెస్తుండడంతో గొడవలు తారస్థాయికి వెళుతున్నాయి. దీంతో మానసికంగా కృంగిపోయిన మందుబాబులు బలవన్మరణాలు చేసుకుంటుండగా, ఇంకొందరు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ కుటుంబ సభ్యుల వద్ద నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. ఆ విధంగా డబ్బులను వారి నుంచి గుంజుకొని తాగుడుకు ఖర్చు చేస్తూ మత్తులో జోగుతూ భార్యా పిల్లల్ని బజారుకీడుస్తున్నారు.

తీర్మానం చేసిన గ్రామాల్లో మళ్లీ బెల్ట్ షాపులు షురూ....?

తాగుడుకు బానిసై ఇల్లు గుల్ల చేసుకుంటున్న కుటుంబాలు, కొన్ని కాగా, అనారోగ్యం పాలై మృతి చెందిన కుటుంబాల దయనీయ పరిస్థితులను చూసి చలించి పోయిన గ్రామ పెద్దలు, బెల్ట్ షాపులను మూసివేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను అరికట్టే విధంగా గ్రామస్తులంతా కలసి సమావేశమై బెల్ట్ షాపులు నిర్వహించరాదని తీర్మానాలు చేశారు. భిక్కనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఒకరిని చూసి మరొకరు ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ క్రమంగా వస్తున్న మార్పులక నుగుణంగా కొందరు పట్టించుకోకపోగా, మరికొందరు బంద్ కు తూట్లు పొడుస్తూ... అండగా వెనకాల మేమున్నామంటూ ధైర్యాన్ని నూరి పోస్తుండగా, ఇంకొందరు బెల్ట్ షాపు యజమానులతో మిలాఖత వుతున్నారు. ఈ నేపథ్యంలో బెల్ట్ బంద్ కు తీర్మానం చేసిన కొన్ని గ్రామాల్లో చాటుమాటుగా మద్యం అమ్మకాలు సాగిస్తుండగా, ఇంకొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు యధావిధిగా తెరుచుకోవడం గమనార్హం.



Next Story

Most Viewed