మూడు పువ్వులు.. ఆరు కాయలుగా అక్రమ వెంచర్ల దంద..

by Disha Web Desk 20 |
మూడు పువ్వులు.. ఆరు కాయలుగా అక్రమ వెంచర్ల దంద..
X

దిశ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఫ్లాట్ల విక్రయ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ఈ క్రమంలో యథేచ్ఛగా అక్రమలే అవుట్లు వెలుస్తున్నాయి. కొందరు రియల్‌ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వెంచర్లు వేస్తున్నారు. వీటిలో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చు. వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలంటే ముందస్తు అనుమతి అవసరం. దీనికోసం పంచాయతీ మొదలు ఆర్‌డీఓ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఫైల్‌ నడవాల్సి ఉంది. అందుకు కొంత సొమ్ము చెల్లించి అనుమతి పొందిన తరువాత మాత్రమే వ్యవసాయ భూమిని మార్పు చేయాలి. మండల పరిధిలో పలుగ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే అనధికార లే అవుట్లు వేసి అమ్ముకుంటున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో రియల్‌ భూం సృష్టించడం, ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ఫ్లాట్లను విక్రయిస్తుండడం షరా మామూలే. వీరి అక్రమాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అదే క్రమంలో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, నాయకులకు వరంగా కూడా మారుతోంది. మండల పరిధిలో అనేక గ్రామాల్లో వ్యవసాయ భూమిని ఇంటి స్థలాలుగా మార్పు చేసి క్రయవిక్రయాలు చేస్తున్నారు. వీటిలో సగానికి కూడా ముందస్తు అనుమతులు లేవు.

స్థిరాస్తి వ్యాపారుల్లో చాలా మంది ఈ నిబంధనలు పాటించడం లేదు. నేరుగా ఇళ్ల స్థలాలను విక్రయిస్తున్నారు. విషయం తెలియని ప్రజలు స్థలాలను కొనుగోలు చేసి భవనాలు నిర్మిస్తున్నారు. కాగా బిచ్కుంద మండలంలో చాలా చోట్ల అనుమతి లేని లేఅవుట్లు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో పంచాయతీలకు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. పంచాయతీ అనుమతి లేకుండా ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసుకోకుండా రోడ్డు పక్కనే ఉన్న భూమిలో లేఅవుట్లు వేసి అమ్మడానికి సిద్ధమయ్యారు. వారికి నచ్చిన ప్రయివేటు సర్వేయర్‌తో కొలతలు వేయించి ఫ్లాట్లు వేయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన రియల్‌ వ్యాపారులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీంతో పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో వ్యవసాయ భూములు లే అవుట్లుగా మారుతాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. బిచ్కుంద పంచాయతీ పరిధిలో రెండు లేదా మూడు లే అవుట్లకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. మిగతా లే అవుట్లకు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు.



Next Story

Most Viewed