అబద్దాలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అందలమెక్కింది

by Disha Web Desk 15 |
అబద్దాలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అందలమెక్కింది
X

దిశ, భీంగల్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అబద్దాలు చెప్పి తక్కువ మెజార్టీతో అందలమెక్కిందని, మళ్లీ అవే అబద్దాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తుందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఆదివారం వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలోని ఏఎన్జీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బీజేవైఎం పార్లమెంట్ స్థాయి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అబద్దాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి లు మోడీ, అమిత్ షాల ప్రసంగాలను మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు. సీఎంకు అభద్రత భావం ఎక్కవయిందని, దాంతో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు.

ఇటీవల మోడీ ప్రోగ్రాంలో మోడీ బడా భాయ్ అని సంభోదించినందుకు ఆయన్ని సీఎం పోస్ట్ నుండి పీకేస్తానని రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు కాగానే రేవంత్ బీజేపీ లోకి వస్తాడని పుకార్లు షికారు చేస్తున్నాయని, ఆమాత్రం దానికి ఎండలో ఇదంతా అవసరమా అని ప్రశ్నించారు. రేవంత్ బీజేపీ లోకి వస్తానంటే నడ్డా ఒప్పుకుంటే నేను ఆహ్వానిస్తానని అన్నారు. రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ వాళ్లు ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నారైల విషయం కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే దయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉంటుందని అన్నారు. మన రాష్ట్రానికి, మన జిల్లాకి వ్యవసాయ

ఆధారిత పరిశ్రమలు తెచ్చి యువత 10 వేల మందికి ఉద్యోగ, ఊపాధి కల్పింస్తానన్నారు. గల్ఫ్ వెళ్లిన వాళ్లలో 10 వేల మంది మనోళ్లను తిరిగి భారత్ కు రప్పిస్తానన్నారు. ఇదే నేను రెండోసారి గెలిచాక చేసేది అన్నారు. కార్యక్రమం లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, బీజేపీ మోర్చా యువ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story