ఎన్ని డ్రామాలాడినా రెండు జాతీయ పార్టీలకు సింగిల్ డిజిటే

by Disha Web Desk 20 |
ఎన్ని డ్రామాలాడినా రెండు జాతీయ పార్టీలకు సింగిల్ డిజిటే
X

దిశ, ఆర్మూర్ : సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజల ఆప్త బంధువు అని, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని మినిస్టర్ క్వార్టర్స్ లో గురువారం డొంకేశ్వర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన నల్మెల గంగారెడ్డి, నూతికాడి రాజారెడ్డి, నూతికాడి చిన్న గంగారెడ్డి నవీన్, శ్రీకాంత్ రెడ్డి, దిలీప్ రెడ్డి, గంగారెడ్డి, సంతోష్ రెడ్డి, గంగారెడ్డి, గడ్డం రాజారెడ్డి, నరసింహ రెడ్డి తదితరులు బీజేపీని వీడి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారంతా బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ సమాజమే గౌరవ సీఎం కేసీఆర్ కుటుంబమన్నారు. "కాంగ్రెస్, బీజేపీలు దోపిడీ శక్తుల కవల పిల్లలు. ఆ రెండు పార్టీలకు పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఎందుకంత ద్వేషం?. కాంగ్రెస్, బీజేపీలది అవినీతి, అక్రమాల చరిత్ర. దొందూదొందే.. అభివృద్ధి నిరోధక పార్టీలు. అబద్దాలు, విష ప్రచారంతో ఎన్ని డ్రామాలాడినా ఈ రెండు జాతీయ పార్టీలకు సింగిల్ డిజిటే గతి అన్నారు. తెలంగాణ గడ్డ అభివృద్ధికి అడ్డా, అభివృద్ధి, సంక్షేమంలో కేసీఆర్ ఒక విప్లవాన్నే సృష్టించారన్నారు. వినూత్న పథకాల సమాహారమైన తెలంగాణ మోడల్ నేడు దేశానికి అవసరం ఉందన్నారు.

ఈ సంకల్పంతోనే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. దేశాన్ని బాగుచేయడానికే కేసీఆర్ జాతీయ రాజకీయ రంగప్రవేశం చేశారని తెలిపారు. కేసీఆర్ పై ఉన్న విశ్వాసంతో తెలంగాణ పల్లె పల్లె, వాడవాడ కారు, సారు, కేసీఆర్ వైపే కదులుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వంటి అనేక వర్గాలకు చెందిన వారికి రూ.2,016, వికలాంగులకు రూ.3,016ల చొప్పున ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పెట్టి రూ.1,00,116ల చొప్పున ఇస్తూ ఇప్పటికే పది లక్షల మందికి పైగా ఆడపిల్లల పెండ్లిండ్లు జరిపించిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.10,000ల చొప్పున పెట్టుబడి సాయం చేస్తూ ఇప్పటికే రూ.50వేల కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

మాతృమూర్తులకు ప్రసవించిన సమయంలో తల్లీ పిల్లల క్షేమం కోసం కేసీఆర్ కిట్లతో పాటు రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ. 13 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోందన్నారు. ఇలాంటి పథకాలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు ప్రజలనాకర్షిస్తున్నాయి. అందుకే పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలంతా కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఈ రెండు జాతీయ పార్టీల నాయకులు కళ్ళుండి చూడలేని కబోదుల మాదిరిగా వ్యవహరిస్తూ గుడ్డి ద్వేషంతో సీఎం కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై, తెలంగాణ రాష్ట్రం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.


Next Story

Most Viewed