మెడికల్ విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలి..

by Disha Web Desk 20 |
మెడికల్ విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలి..
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష (22) మృతి చెందడంతో ఎన్ఎస్ యూఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్ యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లాకార్యదర్శి రఘురాం మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో విద్యార్థి మృతిపట్ల తమకు అనుమానాలు ఉన్నాయని దీన్ని ఆత్మహత్య లాగా కాకుండా వేరే కోణంలో దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. దీని పై సమగ్ర విచారణ చేపట్టాలని తాము రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అలాగే మెడికల్ కాలేజీల్లోని వసతి గృహాల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా అందుబాటులో లేవని కాబట్టి తక్షణమే వసతి గృహాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని వారు కోరారు. మొన్న వరంగల్ లో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడడం ఈరోజు నిజామాబాదులో హర్ష అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇలా రోజుకో మెడికల్ విద్యార్థి మరణించడం చూస్తుంటే అసలు ప్రభుత్వానికి మెడికల్ కళాశాల పర్యవేక్షణ పట్ల చిత్తశుద్ధి ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెస్తామని ప్రగల్బాలు పలకడం కాదని ముందు ఉన్న మెడికల్ కళాశాలలోని విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ నాయకుడు సయ్యద్ అష్రఫ్, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అంజలి, నగర నాయకులు ‌నవిన్, శిరీష పాల్గొన్నారు.



Next Story