పసుపు బోర్డు ఎఫెక్ట్.. కాసులు కురిపిస్తున్న పచ్చ బంగారం

by Disha Web Desk 12 |
పసుపు బోర్డు ఎఫెక్ట్.. కాసులు కురిపిస్తున్న పచ్చ బంగారం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కు వచ్చే పసుపు రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల రాజకీయ వేడి కొనసాగుతుండగా అవేమీ పట్టనట్టు పసుపు క్రయ విక్రయాలు మార్కెట్‌లో జోరుగా సాగుతున్నాయి. పసుపు పంట విస్తీర్ణం తగ్గిందని ఓవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఈసారి ధర మాత్రం అమాంతం పెరిగి రూ.19 వేల వరకు పలికింది. ఈ నెలలో చివరి వరకు క్వింటాల్ కు రూ.22 వేలు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. గత ఐదేళ్లలో పసుపు ధర కుదేలు కాగా ఈసారి పసుపు అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతుండటంతో ధర కూడా పెరిగింది. ఉత్తర తెలంగాణలో పసుపు అత్యధికంగా పండించే నిజామాబాద్ జిల్లా రైతులతో పాటు నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లా రైతులు కూడా పసుపును మంచి ధర పలుకుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పసుపు ధర బంగారాన్ని తలపిస్తోంది. ప్రధానంగా పసుపు బంగారం తో పోల్చిన పసుపు పండించే రైతులకు ఆనవాయితీగా వస్తోంది. గతేడాది వరకు క్వింటా పసుపు ధర రూ.12 వేలు దాటలేది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు వచ్చే పసుపు ధర క్వింటాల్ కు రూ.16 వేలు తక్కువగా కాకుండా పలుకుతుంది. ప్రధానంగా ఎర్రగుంటూరి, ప్రతిభ రకాలు మంచి ధర పలుకుతుంది. గతేడాది వరకు పసుపునకు ధర లేదని తెలంగాణ రైతులు మహారాష్ట్రలోని సాంగ్లీలో విక్రయించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం మొదటి నుంచి పసుపు క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రభుత్వం గెజిట్ ప్రకటించిన తర్వాత ఎన్నికలు రావడంతో అందరూ బిజీగా ఉన్నారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు పసుపు ధర లేదని ఏకంగా బోర్డు కోసం ఎన్నికల్లో నామినేషన్ వేసిన చరిత్ర సృష్టించారు. కానీ ఐదేళ్లు తిరిగేసరికి పసుపు బోర్డు ఏర్పాటు పై ప్రధాని మోదీ ప్రకటనతో పాటు పసుపు మంచి ధర పలుకుతుండడం రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. 2018-19లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు 10 లక్షల 75 వేల 226 క్వింటాళ్ల పసుపు వచ్చిందని, మోడల్ ధర ఆనాడు రూ.5250 కావడం గమనార్హం. ఆనాడు అత్యధికంగా క్వింటాల్ కు వచ్చిన ధర రూ.8681గా రికార్డు అయింది. 2019-20కి వచ్చే సరికి 10 లక్షల 78 వేల 821 క్వింటాళ్లు రాగా మోడల్ ధర అత్యధికంగా రూ.6350 ఉండగా గరిష్టంగా రూ.7678 అత్యధిక ధర పలికింది. 2020-21 లో 8 లక్షల 55వేల 516 క్వింటాళ్లు రాగా మోడల్ ధర రూ.7,100 ఉండగా అత్యధికంగా రూ.10,188 ధరతో పసుపు అమ్మకం జరిగింది.

2021-22 లో 8 లక్షల 38 వేల 932 క్వింటాళ్ల పసుపు మార్కెట్ కు రాగా మోడల్ ధర రూ.7,850ధర పలకగా అత్యధికంగా రూ.9,898 క్వింటాల్ కు పలికింది. గతేడాది 7 లక్షల 49వేల 72 క్వింటాళ్ల పసుపు రాగా మోడల్ ధర రూ.7150 గరిష్టం గా ఉండడం, క్వింటాల్ కు పసుపుకు రూ.9050 అత్యధికంగా ధర అమ్ముడైంది. ఈసారి పసుపు ధర గణనీయంగా ఉన్నప్పటికీ 5 లక్షల క్వింటాళ్ళ పసుపు వస్తుందని అంచనాతో ఉన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు జూన్ నుంచి మార్చి వరకు 3 లక్షల 35 వేల క్వింటాళ్ల రాగా ఏప్రిల్ లో 75 వేల క్వింటాళ్లు, మే నెలలో ఇప్పటి వరకు 4 వేల క్వింటాళ్ల పసుపు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ యేడాది అత్యధికంగా పసుపు ధర రూ.18,630 క్వింటాల్ కు అమ్ముడుపోయింది. ఈ నెలాఖరు వరకు 22 వేల పసుపు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

దాదాపు 6 లక్షల 66 వేల క్వింటాళ్ళ పసుపు క్రయవిక్రయాలు జరుగుతాయని అంచనా ఉంది. దాదాపు లక్ష వరకు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పసుపు ధర అమాంతం పెరుగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమౌతుంది. గతంలో పసుపునకు ధర లేదని పసుపు సాగుకు వెనకడుగు వేసిన రైతులు ప్రస్తుతం ధర మంచిగా రావడంతో ఈ సీజన్ లోనైనా పసుపు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 9 నెలల పంట అయిన పసుపును ఎకరం సాగు చేయాలంటే లక్ష రూపాయల పెట్టుబడి పెట్టాల్సి వస్తుండడంతో గతంలో ధర లేదని దాదాపు సగం సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఒక వైపు ఎన్నికల హడావుడి ఉండగానే పసుపు ధర మాత్రం డిమాండ్ సప్లై సూత్రం ఆధారంగా పెరగడం సాగు చేసిన రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. వచ్చే ఏడాది కూడా పసుపు ధర అదే స్థాయిలో ఉంటే మాత్రం మరోసారి పసుపు సాగుకు రైతులు ఆసక్తి చూపుతారని చెప్పాలి.

Next Story

Most Viewed