Rowdy sheeter: అదుపులో రౌడీ షీటర్ రియాజ్.. ఫోటోను విడుదల చేసిన నిజామాబాద్ పోలీసులు

by Ramesh Naini |   (  Updated:2025-10-19 13:47:31  IST  )

నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పుకార్లు వినిపించాయి.

Rowdy sheeter: అదుపులో రౌడీ షీటర్ రియాజ్.. ఫోటోను విడుదల చేసిన నిజామాబాద్ పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad Police) జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో రౌడీ షీటర్ రియాజ్(Rowdy sheeter Riyaz) ఎన్‌కౌంటర్ (Encounter) జరిగినట్లు పుకార్లు వినిపించాయి. పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలపై తాజాగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరుపలేదు. ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారు. అదుపులోకి తీసుకున్నాం. తాము అదుపులోకి తీసుకోవడానికి ముందే ఒక వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో రియాజ్‌కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం రియాజ్‌కు చికిత్స అందిస్తున్నాం’ అని సీపీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే రౌడీ షీటర్ రియాజ్ అదుపులో ఉన్నట్లుగా చూపే ఫోటోను నిజామాబాద్ పోలీసులు విడుదల చేశారు. ఫోటోలో కనిపిస్తున్న ప్రకారం.. రౌడీ షీటర్ ముఖంపై గాయాలు ఉన్నాయి. పోలీస్ వాహనంలో బేడీలతో కట్టి ఉంచారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్ర‌మోద్‌ను రౌడీ షీటర్ రియాజ్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సంఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి (DGP Shivadhar Reddy) సీరియస్‌ అయ్యారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

Next Story