భుక్తం కోసం కలెక్టర్ ని ఆశ్రయించిన తండ్రి..

by Disha Web Desk 20 |
భుక్తం కోసం కలెక్టర్ ని ఆశ్రయించిన తండ్రి..
X

దిశ, తుంగతుర్తి : కొడుకులు తమను పోషించడం లేదని పేర్కొంటూ ఓ వృద్ధ దంపతుల జంట ఏకంగా జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని లిఖితపూర్వకంగా అభ్యర్థించారు. దీంతో స్పందించిన అధికారులు గ్రామానికి చేరుకొని బహిరంగ సమావేశం ద్వారా న్యాయ విచారణ చేపట్టారు. జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామంలోని ముఖ్యులంతా పాల్గొని చివరికి వృద్ధదంపతుల పోషణ నిమిత్తం కొడుకుల ద్వారా భుక్తాన్ని (పోషణ నిమిత్తం) ఇప్పించే విధంగా కృషి చేశారు. ఆసక్తికరంగా మారిన ఈ సంఘటన తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో గురువారం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే గ్రామానికి చెందిన గుండగాని చినరాములు బుచ్చమ్మ దంపతులకు సంతానం ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి.

చిన్న రాములు 30 గుంటల భూమిని తమ పోషణ నిమిత్తం ఉంచుకొని మిగతా వ్యవసాయ భూమిని కొడుకులకు పంచి ఇచ్చారు. అయితే కొంతకాలం తర్వాత 30 గుంటల భూమి కూడా కొడుకులకు అమ్మాడు. అయితే డబ్బులు చెల్లించే విషయంలో ఇద్దరు కొడుకులు తండ్రి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు గ్రామపెద్దల ద్వారా కూడా పంచాయతీలు జరిగినప్పటికీ సమస్య మాత్రం ఓ కొలిక్కి రాలేదు. చివరికి వృద్ధాప్యంలో ఉన్న తమపోషణ దుర్భరంగా మారిందని పేర్కొంటూ చిన్నరాములు ఇటీవలే సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా సంక్షేమశాఖ అధికారి జ్యోతి, పద్మ, తుంగతుర్తి తహసిల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో భీమ్ సింగ్ లు గురువారం తూర్పుగూడెం గ్రామానికి చేరుకొని బహిరంగ సమావేశం ద్వారా విచారణ చేపట్టారు. గ్రామసర్పంచ్ గుజ్జ పూలమ్మ, ఉపసర్పంచ్ గుండగాని మహేందర్, రాఘవరెడ్డి, గుండగాని కొమురెల్లి, ఎరసాని లింగయ్య, తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటి కుమారుడు తండ్రికి ఉన్న 30 గుంటల భూమిలో తన వాటా కింద 10 గంటల భూమికి రూ.2.50 లక్షలు గతంలో తండ్రికి చెల్లించిన దృష్ట్యా మరో ఇద్దరు కుమారులు అదే రకంగా 45 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.



Next Story

Most Viewed