రాజకీయ మూల్యం చెల్లించక తప్పదు : మంద కృష్ణ మాదిగ

by Ratna Kumari |

దళితులంటే చిన్న చూపు చూస్తున్న కొందరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు భారీ రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.

రాజకీయ మూల్యం చెల్లించక తప్పదు : మంద కృష్ణ మాదిగ
X

దిశ, చిలుకూరు: దళితులంటే చిన్న చూపు చూస్తున్న కొందరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు భారీ రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. గురువారం ఆయ‌న‌ చిలుకూరు జేజేనగర్ లో నిర్వహించిన కర్ల రాజేష్ సంతాపసభలో పాల్గొని మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ చెక్ అక్రమం విషయంలో ఏ నేరమూ చేయని కోదాడకు చెందిన రాజేష్ ను కస్టడీలోకి తీసుకున్న చిలుకూరు పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్లనే మృతి చెందాడని ఆయన ఆరోపించారు. రాజేష్ మృతి విషయంలో నిందితులైన అప్పటి కోదాడ రూరల్ సీఐని సస్పెండ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడానికి కారణమేంటని కృష్ణ మాదిగ ప్రశ్నించారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే తమ సామాజిక వర్గానికి చెందిన ఎస్సైని కాపాడడంలో ప్రధాన పాత్ర వహించారని ఆయన ఆరోపించారు. ఇందుకు వారికి భవిష్యత్ రాజకీయాల్లో తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలో మాలలపై కూడా దాడులు జరిగాయని, వాటిని ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ ఖండి‌స్తున్నాయని మంద కృష్ణ అన్నారు. రాజేష్ మృతికి కారకులైన అధికారులపై సరియైన చర్యలు తీసుకునేంతవరకూ తమ పోరాటం ఆగదని కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గాలకు కూడా మీడియా మిత్రులు తమ వార్తల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన హితవు పలికారు. ఈ సభలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మల్లెపంగు సూరి మాదిగ, సిద్దెల శ్రీను మాదిగ, వడ్డేపల్లి కోటేశ్ మాదిగ, ఏ శ్రీను, కందుకూరి కృష్ణమూర్తి, కంపాటి రంజిత్, మెరిగ రామారావు, వీ ఆనందరావు, బీ శ్రీనివాస్, ఎన్.చంద్రస్వామి, ఏపూరి రాజు, కుడుముల శ్రీను మాదిగ పాల్గొన్నారు.

Next Story