ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు : మంత్రి KTR

by Disha Web Desk 15 |
ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు : మంత్రి KTR
X

దిశ, మునుగోడు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మునుగోడు మండల కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె , పట్టణ ప్రగతి, పరిశ్రమలు, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ, విద్యుత్, మిషన్ భగీరథ, రోడ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, నీటిపారుదల తదితర అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి మున్సిపాలిటీలో ఒక్కటైనా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఉండాలని, వచ్చే మార్చి 31 లోగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో అంతిమ సంస్కారాన్ని సంస్కారవంతంగా నిర్వహించేందుకు వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హైదరాబాదుతో సహా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలలో 1700 పైగా అర్బన్ నర్సరీలు పెట్టుకున్నామని, ఇందుకు పది శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగించుకుంటున్నామని, అవసరం ఉన్నచోట ఇంకా కొత్త నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక దోభీగాట్ ల నిర్మాణం కోసం చర్యలు తీసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని కోరారు. ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డులలో చెత్త తొలగింపునకు బయోమైనింగ్ ప్రక్రియను స్టార్ట్ చేయాలని, మానవ వ్యర్ధాల శుద్ధీకరణ ప్లాంటును ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీ తనదైన మాస్టర్ ప్లాన్ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసుకోవాలని, కూలంకషంగా పరిశీలించుకుని ఆమోదించి పంపాలని తెలిపారు. మున్సిపాలిటీలలో ప్రతి ఇంటికి స్ట్రక్చర్ డిజిటల్ డోర్ నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చిన్న మున్సిపాలిటీలలో ఉన్న సెలూన్ ల వివరాలు పంపాలని, వారికి కొంత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మిషన్ భగీరథ లో భాగంగా ప్రతి ఇంటికి నీటిని అందించాలని, ఇంకా ఎక్కడైనా మంచినీరు అందని ప్రాంతాలు ఉంటే గుర్తించి వెంటనే సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్ ను నియమించడం జరుగుతుందని, 50 వేల జనాభాకు తక్కువ ఉన్న మున్సిపాలిటీలలో రెండు వార్డులకు ఒక వార్డు ఆఫీసర్ ను నియమిస్తామని తెలిపారు. చేనేత రంగానికి సంబంధించి భువనగిరి, నారాయణపురం, గట్టుప్పల్, తేరేటిపల్లి లలో నాలుగు చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత జౌలి శాఖ ద్వారా ఇస్తున్న యార్న్ పై 40 శాతం సబ్సిడీని వెంటనే అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దండు మల్కాపూర్ ఐటీ పార్కు సందర్శన కోసం ప్రజా ప్రతినిధులు స్టడీ టూర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి కోరిక మేరకు పోచంపల్లిలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల సమస్యను పరిష్కరించి రాబోయే మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో మల్టిపుల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, చెక్ డ్యాములకు సంబంధించి ఎన్ని పనులకు ఎన్ని జరిగాయి, ఎన్ని జరుగుతున్నాయి అలాగే కొత్త చెక్ డ్యాములకు ప్రతిపాదనలు, పనుల పూర్తి వివరాల సమగ్ర నివేదికతో వారం రోజుల లోపు నివేదించాలని ఆదేశించారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎన్ని పనులు మంజూరు అయ్యాయి, ఎన్ని పూర్తి అయ్యాయి, పూర్తికాని పనులను ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఎప్పటిలోగా పూర్తి చేసుకోవాలో నిర్ణయించడానికి ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్షా సమావేశం మునుగోడులో జరుపుకుంటున్నట్లు తెలిపారు. పల్లె సీమలు ప్రగతిలో పోటీ పడుతున్నాయని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా చేసిన పనులను ప్రజలకు వివరంగా తెలిసేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉపాధి పనుల కింద ఎక్కువ పని దినాలను నిర్వహించింది తెలంగాణ రాష్ట్రమేనని, నిధుల విడుదలలో కేంద్రం ఎన్నో అవాంతరాలను సృష్టిస్తున్నదని అన్నారు. 2014 సంవత్సరం నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి ప్రారంభం అయిందని, మంచినీరు, సాగునీటి సమస్యలు తీర్చుకున్నామని, 8 ఏళ్లలో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేశామని, ఈ జిల్లా మీద ముఖ్యమంత్రికి ప్రేమ ఎక్కువ అని కొనియాడారు. ఫ్లోరిన్ అనే బ్రహ్మ రాక్షసిని కూకటి వేళ్లతో తొలగించారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందించాలనే ఆలోచన కల్వకుంట్ల తారక రామారావుదేనని పేర్కొన్నారు. జిల్లాకు అన్ని శాఖల ద్వారా ఎక్కువ నిధులు అందుతున్నాయని, తద్వారా వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నామన్నారు.

రాష్ట్ర రోడ్లు భవనాలు , గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనుల అవగాహన కోసం ఈరోజు సమీక్షించుకుంటున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో 907 కి.మీ. వెడల్పు గల సింగిల్ రోడ్డు పనులను డబుల్ రోడ్లుగా మార్చడం జరిగిందని, ఉమ్మడి జిల్లాలో 69.9 కోట్ల విలువగల 70 రోడ్డు పనులు టెండర్ స్టేజిలో ఉన్నాయని, మునుగోడు నియోజకవర్గంలో 136 కి.మీ. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా చేసినట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 40 బ్రిడ్జి పనులు పూర్తి అయ్యాయని, 8 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మొత్తం మీద రోడ్ల మీద రూ.20 వేల కోట్లు, భవనాలకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. చిట్యాల నుండి

రామన్నపేట రోడ్డు వెడల్పు పనులకు నిధులు మంజూరు అయ్యాయని, పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, మండలం కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుండి స్టేట్ లెవెల్లో నాలుగు వరుసల రోడ్ల నిర్మాణము తప్పనిసరిగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని, అందుకనుగుణంగా 8 సంవత్సరాలలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి 6391 ఇండ్లు పూర్తయ్యాయని, వీటిలో 880 లబ్ధిదారులకు అందించినట్టు చెప్పారు.

రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్ పనులలో భాగంగా పిఎంజిఎస్వై కింద సీసీ రోడ్ల పనులకు రూ.209 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, సిఆర్ఆర్ కింద 19 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా చేపట్టి గ్రామపంచాయతీలకు ఆదాయం పెరిగేలా, ట్రాక్టర్ బకాయిలు తీర్చుకోవాలని కోరారు. తడి, పొడి చెత్త సేకరణ ద్వారా డంపింగ్ యార్డులలో ఎరువులు తయారీతో గ్రామపంచాయతీల ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనులను నాణ్యతతో చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దీనిలో మనం అవార్డులు కూడా సాధించామని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 1740 గ్రామ పంచాయతీలకు రోడ్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అలాగే 731 కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలను సీఎం తోడ్పాటుతో పూర్తి చేస్తామని తెలిపారు.

రాష్ట్ర మహిళ, శిశు ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో మైదాన ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు నివసిస్తున్నారని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలు,తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పాటైన చోట రోడ్లు వేసేందుకు ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఐటీడీఏ పరిధి లో రూ.476 కోట్లతో అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. నల్గొండ జిల్లాకు సంబంధించి శాసన సభ్యులు ప్రతిపాదనలు ఇస్తే మంజూరు చేస్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మూడు గిరిజన భవన్ లు రూ.కోటి 20 లక్షలతో మంజూరు చేసినట్లు తెలిపారు. 86 ఆశ్రమ పాఠశాలలు, గురు కులాలు, మినీ గురు కులాలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 25 వేల మంది విద్య ను అభ్య సిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 3146 కొత్త గ్రామపంచాయతీలు గిరిజనులకు రిజర్వ్ చేసినట్లు, 207 తండాలు గ్రామపంచాయతీలుగా మార్చినట్లు ఆమె వెల్లడించారు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర సబ్ కమిటీ నియమించి నట్లు తెలిపారు. ఈ భూములకు రైతు బంధు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు గాను 20444 దరఖాస్తులు వచ్చాయని, 55 763 దరఖాస్తుల పరిశీలించినట్టు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఆలస్యంగా పోడు భూముల పరిశీలన మొదలు పెట్టినట్టు, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

హుజూర్నగర్ శాసన సభ్యులు సైదిరెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ నియోజక వర్గంలో మాత్రమే పోడు సమస్య ఉందని, పోడు దరఖాస్తులకు రశీదు ఇచ్చారని, తహశీల్దార్ కార్యాలయంలో ఆన్ లైన్ చేయలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రులు జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా పోడు సమస్య పై శాసన సభ్యులు భాస్కర్ రావు సీఎం దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. ఎడిట్ ఆప్షన్ ఇస్తే తిరిగి అప్ లోడ్ చేస్తామని సూర్యా పేట కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నల్గొండ, దేవరకొండ లలో రూ.7 కోట్ల 15 లక్షల తో శిక్షణా కేంద్రాలకు సంబంధించి నిర్మాణం జరుగుతోందని అన్నారు. రూ. 4 కోట్ల 75 లక్షలతో నల్గొండ లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పూర్తి చేశామని, గిరిజన భవన్ రెండు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ గ్రిడ్ లైన్ డామేజ్ అయిందని, దీని పనులు వెంటనే చేపట్టాలని కోరారు. ట్యాంక్ బండ్స్ పై, ఫీడర్ చానెల్స్ పై పిచ్చి మొక్కలు, చెట్లు మొలిచినందున ఉపాధి హామీ పథకం కింద వాటిని తొలగించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , ట్రైకార్ చైర్మన్ రాం చంద్ర నాయక్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, గుజ్జ దీపిక యుగంధర్ రావు, ఎమ్మెల్సీ లు కోటిరెడ్డి, నర్సిరెడ్డి, శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, రవీంద్ర కుమార్, ఎన్. భాస్కర్ రావు, నోముల భగత్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు టి. వినయ్ కృష్ణారెడ్డి, పమేలా సత్పతి, హేమంత్ కేశవ్ పాటిల్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed