బీఆర్ఎస్ ఓటమి పై మరోసారి కేటీఆర్ సంచలనం.. అసలు తప్పు ఎక్కడ జరిగిందంటే?

by Jakkula.Mamatha |

మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఓటమి పై మరోసారి కేటీఆర్ సంచలనం.. అసలు తప్పు ఎక్కడ జరిగిందంటే?
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఎవరు ఓడగొట్టలేదని, మనల్ని మనమే ఓడించుకున్నామని, పది సంవత్సరాలు చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలం చెంది ఓటమిపాలయ్యామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తాము పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని పటిష్టంగా నడిపించామని, కానీ పార్టీ కార్యకర్తలను, కమిటీలు, పార్టీని బలోపేతం చేసే విషయంలో కొంచెం పక్కకు పెట్టిన మాట వాస్తవమే అన్నారు. ఈ జనవరి నుంచే పార్టీ సభ్యత్వాలు, కమిటీలు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.‌

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచుల ప్రభంజనం కొనసాగడం చాలా గొప్ప విషయం అన్నారు. 161 మంది సర్పంచులు గెలవడం గొప్ప విషయం అన్నారు. గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల చిల్లర రాజకీయాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ, హుజూర్ నగర్, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలలో తీవ్ర అరాచకాలు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ గెలిచిన చోట సైతం అధికార పార్టీ తట్టుకోలేక అరాచకం సృష్టించిందని, రాష్ట్రం మొత్తం 150 పైన ఇలాంటి గ్రామాలు ఉన్నాయన్నారు. తప్పకుండా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని, తిరిగి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లే అక్కడ ఉండే విధంగా పోరాటం చేస్తామన్నారు.

కడియం శ్రీహరి స్వయంగా తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పినా కూడా ఇవన్నీ కనబడటం లేదా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనీసం ఏ పార్టీ అని అడిగినా కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారని చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బణిఆర్ఎస్ హయాంలో మంత్రి స్పీకర్ గా చేశారని కేసీఆర్ ఏం తక్కువ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పది మంది ఎమ్మెల్యేలవి ఏం బతుకు అది అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మనల్ని ఎవరూ ఓడగొట్టలేదని, మనల్ని మనమే ఓటమిపాలు చేసుకున్నామని, సర్పంచ్ ఎంపీటీసీలకు బిల్లులు ఇప్పించడంలో మన మంత్రులు, మన దగ్గర జాప్యం జరిగిందని, దీంతో వారు కూడా కాస్త నిరాశ పడ్డారని, ఉత్సాహంగా పని చేయలేదు అన్నారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నడపడం చేతకాదన్నారు. కరోనా ఉన్న కరువు పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఆగకుండా కేసీఆర్ పాలన చేశాడని చెప్పారు‌. కేసీఆర్ దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు మూడున్నర లక్షల కోట్లు అని, అందులో 75 వేల కోట్లు రాష్ట్రం ఏర్పడే నాటికి ఉందని చెప్పారు.

దీనికి మాత్రం మంత్రులు, ముఖ్యమంత్రులు లెక్క తెలియకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఉమ్మడి నల్గొండకు మూడు మెడికల్ కాలేజీలు మూడు నర్సింగ్ కాలేజీలు ఇచ్చామన్నారు. దామరచర్లలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గతంలో ఎవరు పట్టించుకోకపోతే కేసీఆర్ 1800 కోట్లు పెట్టి భారతదేశంలోనే అపురూపమైన దేవాలయంగా తీర్చిదిద్దాడని చెప్పారు. కేసీఆర్ ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలేదన్నారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన ప్రజలు నేడు తప్పు జరిగినట్లు అని బాధ పడుతున్నారని చెప్పారు. పాలిచ్చే బర్రెను పక్కన పెట్టి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామన్నారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఈ ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు.

ఆలేరు, భువనగిరిలో గతంలో జరిగిన తప్పులు మళ్ళీ చేయకుండా రానున్న ఎన్నికల్లో ఐక్యమత్యంగా పోరాటం చేసి గులాబీ జెండాను ఎగరవేయాలన్నారు‌. జడ్పిటిసి ఎంపిటిసి సీట్లను గులాబీ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ గెలిచిన చోట ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు ఇవ్వమని కొంతమంది ఎమ్మెల్యేలు చెబుతున్నారని, అవి ఇవ్వకపోవడానికి రేవంత్ రెడ్డి సొత్తు కాదని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అందరికీ వర్తిస్తాయని చెప్పారు‌. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే పైసలు లేవని, ఒక ఎమ్మెల్యే ఏకంగా ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసాడని చెప్పారు‌. ఎమ్మెల్యేల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గెలిచిన సర్పంచులు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదని ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. అధికార పార్టీ ఏదైనా అన్యాయాలు చేయాలని చూస్తే పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 36 మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

గ్రామాల్లో సర్పంచుల గెలుపు స్ఫూర్తితో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ జగదీశ్ రెడ్డి, మాట్లాడుతూ రాష్టంలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు కేటీఆర్ అండగా నిలబడి పోరాటం చేస్తున్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, పోలీసులు కొంతమంది అధికారులతో పోరాటం చేసామన్నారు. ఎన్నికల సంఘం అధికారులు కూడా ఆ కోవలోనే చేరారని, ఓట్లు బయట వేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు చెప్పారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో స్వయంగా మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థులను పిలిచి భయపెడుతున్నారని చెప్పారు. బీబీనగర్ మండలం రాఘవపురం, వాసాలమర్రితో సహా 30 మంది సర్పంచులు ఉమ్మడి నల్లగొండలో మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుందన్నారు.

ఎస్పీ స్థాయి అధికారులు తమ ఫోన్ లేపడానికి భయపడుతున్నారని చెప్పారు. ప్రతి ఊరిలో కేసీఆర్ ఉన్నాడని చెప్పడానికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలు అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సైతం గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. ఈ మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి‌ కిషోర్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, సీనియర్ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, కర్నె ప్రభాకర్, క్యామ మల్లేష్, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, తుంగ బాలు, పల్లె రవి, పెద్ద ఎత్తున్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story