మీకు దమ్ముంటే రైతుల వద్దకు వెళ్ళండి

by Disha Web Desk 22 |
మీకు దమ్ముంటే రైతుల వద్దకు వెళ్ళండి
X

దిశ, తుంగతుర్తి: మీకు దమ్ము, ధైర్యం ఉంటే రైతుల వద్దకు వెళ్లడంతో పాటు ఎండిన పంట పొలాలను పరిశీలించాలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్‌లు మంత్రులకు సవాల్ విసిరారు. నేడు ఏ గ్రామానికి వెళ్లిన ఎండిపోయిన పంటలతో రైతుల ఏడుపులే వినిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి తెచ్చిన కరువు కంటే వ్యవసాయ రంగంపై పాలకుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం వల్లనే పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగు పల్లి, సింగారం తండా గ్రామాల్లో వారు శుక్రవారం ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం, ఎస్సారెస్పీ ఆయకట్టులను ఎడారిలా మార్చిందని అన్నారు. తద్వారా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్‌కు మంచి పేరు ఎక్కడ వస్తుందోననే అక్కసుతో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును నిష్ప్రయోజనం చేశారని మండిపడ్డారు.

నీటిని ఎత్తిపోసి కష్టకాలంలో ఉన్న రైతులకు ఇవ్వాలన్న కనీస సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. నేడు ఏ గ్రామానికి వెళ్లిన ఎండిపోయిన పంట పొలాలతో రైతులు బోరున విలపిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయని అన్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలించాలన్న సోయి ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యేలకు లేదన్నారు. కేసీఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా చూసుకోవాలే తప్ప రైతులపై కాదన్నారు. వారి కక్ష వల్ల రైతులు బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ రెండో దశ కింద నీళ్లు ఇస్తాం, పంటలు సాగు చేసుకోమని చెప్పిన ప్రభుత్వం చివరకు ముఖం చాటేసి రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పండగలా మారిన వ్యవసాయ రంగం నేడు అధ్వాన మైందని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన ఎండిపోయిన పంట పొలాలు, చెరువులు కుంటలే కనిపిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ సైదులు, వైస్ ఎంపీపీ శ్రీశైలం, ఎంపీటీసీ కవిత, నాయకులు గుండ గాని రాములు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed