ఆ నాలుగు సీట్లపైనే BRS గంపెడాశలు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు సవాల్‌గా మారిన గెలుపు..!

by Disha Web Desk 19 |
ఆ నాలుగు సీట్లపైనే BRS గంపెడాశలు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు సవాల్‌గా మారిన గెలుపు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆ నాలుగు స్థానాలపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు రంగంలోకి దిగారు. ఒకవైపు రోడ్డుషోలు, మరోవైపు సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు యాక్టీవ్ చేస్తున్నారు. గత అసెంబ్లీలో వచ్చిన ఓట్ల శాతంను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వివరిస్తూ కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ హామీలను ప్రచార అస్త్రంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన మేర రెస్పాన్స్ రావడం లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఆ ముగ్గురికి సవాల్

కరీంనగర్‌‌లో బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌‌రావును గెలిపించడానికి కేటీఆర్‌, మెదక్‌లో వెంకట్రామిరెడ్డిని హరీశ్‌రావు, నాగర్‌కర్నూల్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించడానికి కేసీఆర్, కేటీఆర్ ముమ్మరంగా కృషి చేస్తున్నారు. కరీంనగర్, మెదక్‌లో కేటీఆర్, హరీశ్ రావు తమ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు కావడం, ఇక్కడ పార్టీని గెలిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

కేటీఆర్ పట్టు నిలుపుకునేనా..?

కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్‌లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 5,12,352 ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీకి 5,17,601 ఓట్లు, బీజేపీకి 2,50,400 ఓట్లు వచ్చాయి. మొత్తం 13,76,685 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కు 5,249 ఓట్లు మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి విజయం సాధ్యమని, కేవలం తక్కువ ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కోల్పోయామని వివరిస్తున్నారు. కరీంనగర్‌లో పట్టు కోసం కేటీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

హరీశ్ రావు స్పెషల్ ఫోకస్

మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్దిపేట, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరువు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 4,20,881 ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీకి 6,68,955 ఓట్లు, బీజేపీకి 2,11,626 ఓట్లు వచ్చాయి. మొత్తం 14,37,897 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ 2,48,074 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే సిట్టింగ్ స్థానం కావడంతో దానిని నిలుపుకునేందుకు హరీశ్ రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

కేసీఆర్‌పైనే భరోసా

నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో గద్వాల్, ఆలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 6,39,622 ఓట్లు రాగా, బీఆర్ఎస్‌కు 5,34,401 ఓట్లు, బీజేపీకి 1,18,513 ఓట్లు వచ్చాయి. మొత్తం 14,00,049 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు 1,05,224 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ ఎస్సీ రిజర్వు కావడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థి కావడంతో కలిసి వస్తుందని బీఆర్ఎస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఈ స్థానంపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

ఆదరణ లభించేనా..?

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి 6,82,033 ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీకి 3,74,363 ఓట్లు, బీజేపీకి 79,418 ఓట్లు వచ్చాయి. మొత్తం 12,25,768 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు 3,07,670 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పార్లమెంటు టికెట్ ఇచ్చింది. దీంతో ఆయనకు ప్రజల్లో ఆదరణ ఉందని, ఆ అంశం కలిసి వస్తుందని భావించడంతో పాటు కేసీఆర్, కేటీఆర్ సైతం గెలుపుకోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ఎప్పకటిప్పుడు కేడర్‌ను అలర్ట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed