ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: డీఎస్పీ తిరుపతిరావు

by Disha Web Desk 9 |
ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: డీఎస్పీ తిరుపతిరావు
X

దిశ, కొత్తగూడ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ మండలాల్లో కేంద్ర బలగాలు, పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. గంగారం మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్​కేకన్ ఆదేశాల మేరకు పోలీసులు మండలంలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఏజెన్సీ గ్రామాలను జల్లెడ పడుతున్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతవరణంలో నిర్వహించేందుకు తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఆదివారం గంగారం మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, గూడూరు సీఐ బాబురావు, గంగారం ఎస్సై రవికుమార్ సిబ్బంది తో కలిసి పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాల్లో సమస్యలపై గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని, ప్రలోభాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు అందుబాటులో ఉంటారని, ఎలాంటి సమస్య ఉన్నా సమాచారం అందించాలన్నారు. అపరిచిత వ్యక్తుల కదలికలపై, అసాంఘిక శక్తులపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమం లో కానిస్టేబుల్ లు శ్రవణ్,నాగరాజు, వీరేందర్, కేంద్ర బలగాలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story