కేసీఆర్.. ఆదిలాబాద్‌లో రైలు మార్గానికి 50 శాతం నిధులివ్వు

by Disha Web Desk |
కేసీఆర్.. ఆదిలాబాద్‌లో రైలు మార్గానికి 50 శాతం నిధులివ్వు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆదిలాబాద్-ఆర్మూర్‌లో రైలు మార్గానికి 50 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ఆదిలాబాద్ ప్రాంత సమస్యలు, ఆదివాసీల సమస్యలపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి వివరించినట్లు చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం వినతి పత్రం అందించినట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి శుభాకాంక్షలు తెలిపామన్నారు. ఆదివాసీ చట్టాలను బలోపేతం చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాని కలిసి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని జ్యోతిరాధిత్య సింధియా చెప్పారన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి 650 ఎకరాల భూమి అవసరం ఉందని, భూమి కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సోయం బాపూరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడం లేదని, కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న ఆవాస్ యోజన పథకానికి కూడా అడ్డుపడుతున్నాని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టిందో చూపించాలన్నారు. చాలామంది ఆదివాసీలు ఇండ్లు లేక డబుల్ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

పోడు భూముల విషయంలో రైతులపై రాష్ట్ర సర్కార్ కర్కషంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్ని సంవత్సరాలైనా ఆదివాసులకు పట్టా అందించలేదన్నారు. బాసరలో త్రిబుల్ ఐటీ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఫైరయ్యారు. విద్యార్థులు వారికి దక్కాల్సిన హక్కులపై పోరాటం చేస్తే తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు. గవర్నర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పరామర్శకు వెళ్తే కనీసం స్థానిక యంత్రాంగం ప్రొటోకాల్ పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed