రాహుల్ వయస్సు పెరుగుతోంది.. కానీ మెచ్యూరిటీ తగ్గుతోంది: MP లక్ష్మణ్

by Disha Web Desk 19 |
రాహుల్ వయస్సు పెరుగుతోంది.. కానీ మెచ్యూరిటీ తగ్గుతోంది: MP లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రోజురోజుకూ రాహుల్ గాంధీ వయస్సు పెరుగుతోందని, అయితే మెచ్యూరిటీ మాత్రం తగ్గుతోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయాలపై మాట్లాడేందుకు రాహుల్‌కు నోరు రావడం లేదని విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటపల్లి జనార్ధన్, మరో నేత వెంకటేశ్వర్ గౌడ్ బీజేపీలో చేరారు. కాగా వారికి లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. నామినేషన్ తొలిరోజే మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారని, ఈ ర్యాలీలు చూస్తే.. విజయకేతన ర్యాలీల్లాగా కనిపించాయన్నారు. కాగా.. రాహుల్ గాంధీ దేశాన్ని విభజించేందుకు రకరకాలుగా కుట్రలు పన్నుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల బాండ్ల విధానం రాకముందు నల్లధనం ఇష్టానుసారంగా ప్రవహించేదని, ఎన్నికల బాండ్లతో పారదర్శకతను తీసుకువచ్చి నల్లధనాన్ని మోడీ అరికట్టారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ విరాళాలు పొందలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎలక్ట్రోరల్ బాండ్లను వ్యతిరేకించడమంటే నల్లధనాన్ని ప్రోత్సహించడం కాదా అని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐలను అడ్డుపెట్టుకుని బీజేపీ విరాళాలు సేకరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఓటమి కోసం కారణాలు వెతుక్కునేందుకు ఎలక్టోరల్ బాండ్లు, ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నారని ఫైరయ్యారు. మోడీ వస్తే ఎన్నికలు జరగవని, ఇవే చివరి ఎన్నికలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఆరోపణల్లో ఏ మాత్రం పస లేదని ఫైరయ్యారు. ఉత్తరాదిన కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని, దక్షిణాదిన కనుమరుగవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ చౌకబారు మాటలు మానుకోవాలని లక్ష్మణ్ సూచించారు.

Next Story

Most Viewed