తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా ఎంపీ కోమటిరెడ్డి వ్యవహారం

by Disha Web Desk 4 |
తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా ఎంపీ కోమటిరెడ్డి వ్యవహారం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వ్యవహారం నాయకత్వానికి కొరకరాని కొయ్యగా తయారైంది. ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నా ఆయన తరఫున ఎలాంటి చొరవా లేదనే చర్చలు గాంధీభవన్‌లో జోరుగా సాగుతున్నాయి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ప్రయత్నాలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి ఇటీవలి కాలంలో అంటీ ముట్టనట్లుగానే ఉండిపోయారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థిని బలపర్చాలంటూ పార్టీ కార్యకర్తలతో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు ఆడియో క్లిప్ రూపంలో లీక్ కావడంతో ఇరుకున పడ్డారు. ఆ కారణంగానే పార్టీలో కీలకమైన కమిటీల్లో ఆయనకు స్థానం దక్కలేదనే వార్తలూ వినిపిస్తున్నాయి.

ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీలో, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో, స్క్రీనింగ్ కమిటీలో ఎంపీ కోమటిరెడ్డికి స్థానం దక్కలేదు. దీనికి బదులుగా జిల్లాకు చెందిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో, స్క్రీనింగ్ కమిటీలో చోటు లభించింది. దీన్ని జీర్ణించుకోలేకనే కొన్ని రోజులుగా పార్టీ యాక్టివిటీస్‌కు దూరంగా ఉన్నారనే అనుమానాలు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చలుగా వెలుగులోకి వచ్చాయి. గాందీ భవన్‌లో ఆశావహుల దరఖాస్తుల ప్రక్రియ మూడు నాలుగు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నా, స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనడానికి ఏఐసీసీ నేతలు వచ్చినా, వర్కింగ్ కమిటీ సమావేశాల నిర్వహణ నిమిత్తం పార్టీ ప్రధాన కార్యదర్శి వచ్చినా కలవకుండా గైర్హాజరయ్యారు.

స్వయంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే ఆయన నివాసానికి వెళ్ళి బుజ్జగింపు చర్యలు చేపట్టారు. అయినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్వయంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగి ఫోన్ చేసి పిలిచారు. దానికి కొనసాగింపుగా గురువారం ఉదయం ఇద్దరూ కలిసి కారులోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు కలిసి వెళ్ళారు. వర్కింగ్ కమిటీ సమావేశాలు, సోనియాగాంధీ పాల్గొనే బహిరంగసభల గురించి వివరించి పార్టీ లైన్ ప్రకారం తగిన చొరవ తీసుకోవాల్సిందేనని, సహకరించాల్సిందేనని నొక్కిచెప్పినట్లు తెలిసింది. ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా?.. నాయకత్వానికి సహకరిస్తారా?.. పార్టీ లైన్ ప్రకారం నడుచుకుంటారా?.. ఇవే ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా నేతల మధ్య జరుగుతున్న చర్చలు.



Next Story