తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి: MLC Narsireddy

by Disha Web Desk 2 |
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి: MLC Narsireddy
X

దిశ , తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా జాతీయ స్థాయిలో విశాల ఐక్య వేదిక ఏర్పాటు కావడం మంచిపరిణామమని అన్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపీఎస్) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన పెన్షన్ విధానాన్ని (ఎన్పీఎస్) కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా 1 జనవరి 2004 నుండి అమలులోకి తీసుకొచ్చిందని, పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి సెప్టెంబర్ 2004 నుండి అమలుపరుస్తున్నదని తెలిపారు.

ఇప్పటివరకు ఈ ఎన్‌పీఎస్‌లో దేశం మొత్తం మీద కోటి 75 లక్షల మంది సభ్యులుగా బలవంతంగా నెట్టబడ్డారు. సీపీఎస్ పథకం ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ విశాల ఐక్య వేదికలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత పాలకులు ఓపీఎస్ పునరుద్ధరించడం సాధ్యం కాదని దానివల్ల ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున భారం అవుతుందని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని పదేపదే తమ అనుకూలమైన మీడియా సంస్థల ద్వారాతప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.



Next Story