మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు: ఎమ్మెల్సీ కవిత

by Disha Web Desk 12 |
మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు: ఎమ్మెల్సీ కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇది తప్పు అని, ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. బీజేపీ తొలుత వ్యాపార సంస్థలపై దాడి చేసి, వాటిని నియంత్రించడానికి ప్రయత్నించిందన్నారు.

ఇప్పుడు రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పూ చేయలేదన్న కవిత, పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈడీ పిలిచినప్పుడల్లా విచారణకు హాజరవుతానని, వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటూ కవిత వెల్లడించారు.

మరోవైపు, రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని.. కానీ అవి అమలు కావడం లేదని ఆమె విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వెంటనే తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూడా ఇది దోహదపడుతుందన్నారు. ఇందుకోసం బుధవారం ఢిల్లీలోని లే మెరిడియన్‌ హోటల్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆమె ఢిల్లీ చేరుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం, మహిళా సంఘ ప్రతినిధులతో మధ్యాహ్నం 3 గంటలకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ఆమోదంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కూడా పాల్గొనాలని కోరారు.


Next Story

Most Viewed