ఇప్పటికీ ఆధార్‌తో లింక్ అవ్వని పాన్‌కార్డుల సంఖ్య 14 కోట్లు: ఆదాయపు పన్ను శాఖ

by Dishanational1 |
ఇప్పటికీ ఆధార్‌తో లింక్ అవ్వని పాన్‌కార్డుల సంఖ్య 14 కోట్లు: ఆదాయపు పన్ను శాఖ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని ఉన్న దాదాపు సగం మంది వద్ద శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) కార్డు ఉందని ఆదాయ పన్ను శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. పురుషులు, మహిళల పాన్ కార్డుల సంఖ్య మధ్య అంతరం ఇప్పటికీ అధికంగానే ఉందని ఆదాయ పన్ను శాఖ అభిప్రాయపడింది. అయితే, ఇది క్రమంగా నెమ్మదిస్తోందని పేర్కొంది. 2024, మార్చి 31 నాటికి మొత్తం 42.14 కోట్ల మంది పురుషులు పాన్ కార్డును కలిగి ఉండగా, 31.05 కోట్ల మంది మహిళల వద్ద పాన్ కార్డులు ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో(మార్చి 31 నాటికి) మొత్తం 14 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడంతో అవన్నీ పనిచేయకుండాపోయే ముప్పు ఉందని సమాచారం. డేటా ప్రకారం, మార్చి నాటికి దేశంలో 74.67 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. ఇవి గతేడాది మార్చి 31 నాటికి నమోదైన 67.67 కోట్ల కంటే 10 శాతం పెరిగాయి. అదే విధంగా 2014, మార్చి నుంచి అంటే పదేళ్లలో 2.76 కోట్ల నుంచి 2,500 శాతం పాన్ కార్డులు పెరిగాయి. పాన్ కార్డులు పెరగడానికి ప్రధానంగా ఆర్థిక లావాదేవీల్లో ఇది తప్పనిసరి చేయడమని నివేదిక అభిప్రాయపడింది. అలాగే, టీడీఎస్, టీసీఎస్ కోసం పాన్ కార్డు అవసరం ఉండటం, ఆదాయ పన్ను నిబంధనలలోని 18 రకాల ఆర్థిక లావాదేవీలకు పాన్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం కూడా పాన్ కార్డుల సంఖ్య పెరిగేందుకు మరో ప్రధాన కారణమని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పాన్, ఆధార్ లింక్ చేసేందుకు పలు దశల్లో గడువును పొడిగించడం జరిగింది. 2023, జూలై 1 నుంచి అనుసంధానం కాని పాన్ కార్డులు పనిచేయవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత పాన్ కార్డును రూ. 1,000 ఆలస్య రుసుముతో యాక్టివ్ చేసుకోవచ్చు.



Next Story