మిషన్​కాకతీయ యాదిమరిచిండ్రు.. రెండో టర్మ్‌లో ‘నో’ ఇంప్లిమెంటేషన్

by Disha Web Desk 4 |
మిషన్​కాకతీయ యాదిమరిచిండ్రు.. రెండో టర్మ్‌లో  ‘నో’ ఇంప్లిమెంటేషన్
X

తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.. ఇదీ తరచూ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలు చెప్పే మాట. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదంటూ గొప్పగా ప్రకటనలు చేస్తుంటారు. కానీ పలు పథకాలను ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్రం నుంచి కాపీ కొట్టినట్లుగానే మిషన్ కాకతీయ స్కీమ్‌ను కూడా అరువు తెచ్చుకున్నదే.

పదో పంచవర్ష ప్రణాళికలో 2005లో యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన ట్రిపుల్ ఆర్ (రిపేర్, రినోవేషన్, రిస్టోరేషన్) పథకానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరు పెట్టి భారీ ప్రకటనలతో గొప్పగా పబ్లిసిటీ చేసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ సరోవర్ పథకానికి ఆదర్శంగా నిలిచిందంటూ మార్కెటింగ్ చేసుకుంటున్నది. - దిశ, తెలంగాణ బ్యూరో

సగంతోనే సరి

తొలి టర్ములో ప్రారంభించిన ఈ పథకాన్ని రెండో టర్ములో అటకెక్కించింది. ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని చెరువులనూ పునరుద్ధరిస్తామంటూ ఆర్భాటంగా చెప్పుకున్నా నాలుగు దశల తర్వాత 2017లోనే మంగళం పాడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జోడింపుగా మిషన్ కాకతీయను ప్రస్తావిస్తూ కోటి ఎకరాల మాగాణి కల ఫలిస్తూ ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం తన ప్రగతి నివేదికలో గర్వంగా ప్రకటించుకున్నది.

ఇప్పటివరకు సగం లక్ష్యాన్ని మాత్రమే పూర్తిచేసి సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టించినట్లు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. రాష్ట్రంలోని మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించాలనే లక్ష్యంలో నాలుగు దశల్లో కేవలం 21,633 చెరువుల్లో మాత్రమే పనులు పూర్తి చేసింది. మిగిలిన 24,898 చెరువులను గాలికొదిలేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్ గురించి పట్టించుకోలేదు.

నాలుగు విడతల్లో జరిగిన పనులతో సుమారు 15 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చినట్లు క్లెయిమ్ చేసుకుంటున్నది. ఈ చెరువుల్లో దాదాపు 9.61 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నది. ఇదిలా ఉంటే.. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మిషన్​ కాకతీయ సక్సెస్​ పేరిట ఊరూరా చెరువుల పండుగ పేరుతో గ్రామాల్లోని చెరువుల దగ్గర ఫ్లెక్సీలు పెట్టి సంబురాలకు, సహపంక్తి భోజనాలకు ప్లాన్ చేసుకున్నది.

ట్రిపుల్ ఆర్ స్కీమ్‌కు కొత్త పేరు

కేంద్ర ప్రభుత్వ ట్రిపుల్ ఆర్ (రిపేర్, రినోవేషన్, రిస్టోరేషన్) స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో అమలుచేసింది. ట్రిపుల్ ఆర్ స్కీమ్‌ కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులతో అమలైంది. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం, పూడికతీత పనులతో నీటి వనరులను మెరుగుపర్చే ఉద్దేశంతో మిషన్ కాకతీయ పేరుతో వినూత్న పథకాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. దీని ద్వారా ఎండకాలంలో సైతం పూర్తిస్థాయి నీటి నిల్వలతో చెరువులు కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నది. ఎండిపోయిన చెరువులో సంబురాలు ఎలా చేస్తారంటూ వరంగల్ జిల్లా కాటారం గ్రామస్తులు ఎద్దేవా చేశారు.

ఖర్చయింది సగమే

మిషన్ కాకతీయ ప్రాజెక్టును ఐదేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా నాలుగేండ్లకే సరిపెట్టింది. నాలుగేండ్ల వార్షిక బడ్జెట్‌లో మొత్తం రూ. 6,532 కోట్లను కేటాయించింది. కానీ చివరకు ఖర్చయింది కేవలం రూ. 3,231 కోట్లే. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 5,464 కోట్లు ఖర్చు చేసినట్లు తన ప్రగతి నివేదికలో పేర్కొన్నది.

ఇప్పటివరకు అయిన మొత్తం ఖర్చులో రూ. 677 కోట్లను నాబార్డు ద్వారా రుణంగా సమకూర్చుకున్నదే. కేంద్ర జల సంఘం రూ. 125 కోట్లకు ఐదు జిల్లాల్లోని చెరువులకు నిధులను మంజూరు చేసింది. ఆర్భాటంగా ఈ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా 2018 ఎన్నికల తర్వాత మంగళం పాడింది. కాగ్ లెక్కల ప్రకారం 2017 మార్చి నాటికి రూ. 4,260 కోట్లు ఖర్చయినట్లు వెల్లడించింది.

విరాళాల సేకరణ

ఈ స్కీమ్ అమలు కోసం ప్రభుత్వం విరాళాల విధానానికి శ్రీకారం చుట్టింది. సుమారు రూ. 40 కోట్లకు పైగానే డొనేషన్ల రూపంలో సమకూరాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలురూ. 8.78 కోట్లను విరాళంగా ఇచ్చాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యసభ్యుడిగా ఉన్న హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధి రెడ్డి రూ. 3.04 కోట్లను ఇచ్చారు. సిమెడ్ లాబ్స్ అధినేత మోహన్‌రావు కోటిన్నర ఇచ్చారు. క్రెడాయ్ సభ్యత్వ రియల్ ఎస్టేట్ సంస్థలు రూ. 80.50 లక్షలను ఇచ్చాయి. గ్లాండ్ ఫార్మా అధినేత పీవీఎన్ రాజు రూ. 50 లక్షలను అందించారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు కూడా విరాళాల రూపంలో ఈ స్కీమ్‌కు ఆర్థిక సహకారం అందించారు.

‘కాగ్’ అక్షింతలు

ఈ స్కీమ్ అమలుపై 2017లోనే కాగ్ (కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్) తన వార్షిక ఆడిట్ రిపోర్టులో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించలేకపోయిందని తూర్పారబట్టింది. వాస్తవానికి దగ్గరగా లేదని ఎండగట్టింది. ప్రతి ఏటా 20% చొప్పున మొత్తం ఐదేండ్ల వ్యవధిలో రాష్ట్రంలోని 46,531 చెరువులను పునరుద్ధరించడం సర్కారు లక్ష్యమైనా 2017 నాటికి కేవలం 28% టార్గెట్ మాత్రమే పూర్తయిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మూడేండ్ల వ్యవధిలో రూ. 3,231 కోట్లు ఖర్చు చేసినా లక్ష్యం నెరవేరకపోవడాన్ని తప్పుపట్టింది. చెరువుల్లో పూడికతీత పనులపై అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

పూడికతీత పనులపై ఆరోపణలు

మిషన్ కాకతీయలో పూడికతీత పనులు చాలా ప్రధాన భూమిక పోషిస్తాయని పేర్కొన్న కాగ్.. అనేక లోపాలు జరిగినట్లు వ్యాఖ్యానించింది. చెరువుల్లోని మట్టిని రైతులు తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని పేర్కొన్నది. వ్యవసాయానికి ఈ మట్టి పనికిరానందునే రైతులు సిద్ధపడలేదనే వివరణ కూడా సహేతుకంగా లేదన్నది.

పనులు పూర్తయినట్లు ప్రభుత్వం చెప్పిన 27 చెరువుల్లో జరిపిన క్షేత్రస్థాయి అధ్యయనంలో కనీసం మూడో వంతు పూడికతీత కూడా పూర్తికాలేదని, కానీ రికార్డుల్లో మాత్రం భిన్నంగా ఉన్న అంశాన్ని ఉదహరించింది. ఫస్ట్ ఫేజ్‌లో 66%, సెకండ్ ఫేజ్‌లో 14%, థర్డ్ ఫేజ్‌లో 25% చెరువుల పనులు మాత్రమే పూర్తయ్యి సగటున 28% దాటలేదని వ్యాఖ్యానించింది.

నెరవేరని ఆయకట్టు టార్గెట్

స్కీమ్ ద్వారా ప్రభుత్వం చెప్తున్నట్లుగా ‘ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేటెడ్’, ‘యుటిలైజ్డ్’ అంశాల్లో వెలితిగా ఉన్న 10 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించలేదని ఎత్తిచూపింది. ఈ స్కీమ్ మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నా ఆ దిశగా ఫలాలు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి కూడా దీనిపైన స్పష్టమైన సమాధానం రాలేదని గుర్తుచేసింది. ప్రయారిటీ ప్రకారం చెరువులను గుర్తించి పనులు చేపట్టడంలో లోపం జరిగినట్లు పేర్కొన్నది. నాబార్డ్ సంస్థకు అనుబంధంగా ఉన్న నాబ్‌కాన్స్ ద్వారా థర్డ్ పార్టీ రూపంలో అధ్యయనం చేయించినట్లు ప్రభుత్వం ప్రకటించుకున్నది.

మట్టి తరలింపు పనుల్లో అవకతవకలు

చెరువుల్లో పూడికతీత పనులతో వచ్చే మట్టిని తరలించడానికి అయిన ఖర్చు లెక్కల్లో గోల్‌మాల్ జరిగిందని అప్పట్లోనే విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. తక్కువ మట్టిని తీసినా లెక్కల్లో ఎక్కువగా చూపించినట్లు బహిరంగంగానే గ్రామస్తుల నుంచి ఆరోపణలు వచ్చాయి.

ప్రభుత్వం నుంచి బిల్లుల రూపంలో ఎక్కువ మొత్తం డ్రా చేయడానికి ఈ అవకతవకలకు పాల్పడినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. చివరకు కాగ్ సైతం తన ఫీల్డ్ లెవల్ స్టడీలో కేవలం 33% మాత్రమే పూడికతీత పనులు జరిగాయని, మొత్తం 100% మేర మట్టి తరలింపు జరగలేదని తేలింది. కోట్ల రూపాయల మేర అవినీతి, అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు రావడంతో స్కీమ్ అమలు పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.

నీతి ఆయోగ్.. బేఖాతర్

మిషన్ కాకతీయ స్కీమ్‌కు రూ. 5,205 కోట్లను కేటాయించాల్సిందిగా నీతి ఆయోగ్ 2015 మే 31న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నప్పటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తులు చేసింది. కానీ ఇప్పటివరకు ఆ సిఫారసుల మేరకు సాయం అందలేదు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. ఇప్పటికీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. టీమ్ ఇండియా పేరుతో సహకార సమాఖ్య స్ఫూర్తి గురించి లెక్చర్లు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నదని మంత్రులు నిలదీశారు.

మంచి ఫలితాలున్నా డిస్‌కంటిన్యూ

మిషన్ కాకతీయ స్కీమ్ ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని, సుమారు 15 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్తున్నా రెండో టర్ములో ఎందుకు చేపట్టలేదనే ప్రశ్నకు సమాధానం కరువైంది. మంచి ఫలితాలు వచ్చినప్పుడు నాలుగు దశలకే ఎందుకు పరిమితం చేశారన్న విమర్శలూ వచ్చాయి. ఈ పథకం అమలులో చెరువుల్లో మట్టి తరలింపు మొదలు అనేక రూపాల్లో అవినీతి జరిగిందని విమర్శిస్తున్న విపక్షాలు చివరకు దీన్ని ‘కమీషన్ కాకతీయ’ అని తేల్చేశాయి.

Next Story

Most Viewed