పేదలకు వైద్యం భారం కావద్దనే: మంత్రి వేముల

by Disha Web Desk 2 |
పేదలకు వైద్యం భారం కావద్దనే: మంత్రి వేముల
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేదల వైద్యం భారం కావద్దనే తెలంగాణ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించ తలపెట్టిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ కార్యాలయంలో ఆదివారం అధికారులు, ప్రభుత్వ దవాఖానాల నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, టిమ్స్ ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ దవాఖానాల నిర్మాణాలపై అధికారులతోనూ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ధృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ అధునాతన టెక్నాలజీ, సకలసదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. వరంగల్ ఆసుపత్రి నిర్మాణంలో వేగం పెంచాలని, అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని అదేశించారు. జూన్ 22న వరంగల్ హాస్పిటల్ సైట్ విజిట్ చేస్తానని, మనసుపెట్టి పనిచేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని సూచించారు.

ఎల్బీ నగర్ 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ఈనెల 26 వరకు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. ఆ లోగా అన్ని టెక్నికల్ అంశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అల్వాల్ 1200 పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పుట్టింగ్ పనులు మొదలు పెట్టాలని వర్క్ ఏజెన్సీకి సూచించారు. అనంతరం సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ స్ట్రక్చరల్ డిజైన్స్ పరిశీలించారు. ఈనెల 29 న అల్వాల్, సనత్ నగర్ హాస్పిటల్స్ నిర్మాణ సైట్‌లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానన్నారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, హఫీజ్, నాగేందర్ రావు, నర్సింగరావు, డీఈ దుర్గ ప్రసాద్, ఏఈలు రోహిత్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed