- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్.. ‘ఇందిరమ్మ ఇండ్లు’ బిల్లుల చెల్లింపుల్లో మార్పులు.. లబ్ధిదారులు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma houses) పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. నాలుగు విడతలుగా అందజేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐహెచ్‌హెచ్ఎల్) పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని ఆయన తెలిపారు. కేవలం చెల్లింపుల షెడ్యూల్‌లో మాత్రమే మార్పులు జరుగుతాయని.. లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బేస్‌మెంట్ వరకూ నిర్మాణం పూర్తయితే లక్ష రూపాయలు, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో రూ.లక్ష విడుదల చేస్తున్నారు. అలాగే.. ప్రస్తుతం రూఫ్ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు రూ.2 లక్షలను చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి (90 రోజుల పనిదినాలమొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్దేశించిన మొత్తం) వారి ఖాతాల్లోకే నేరుగా జమ అవుతుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి శ్లాబ్ వేసిన తర్వాత చెల్లించే మొత్తాన్ని రూ.1.40 లక్షలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. ఇకపై శ్లాబ్ పూర్తయిన తర్వాత రూ.1.40 లక్షలను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని, మిగిలిన మొత్తాన్ని (రూ.60 వేలను) కూడా లబ్ధిదారుల ఖాతాల్లో ఉపాధి హామీ పథకం కింద అందజేస్తారని తెలిపారు. అలాగే ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత మిగిలిన లక్ష రూపాయలను విడుదల చేస్తారు. పరిపాలనా సౌలభ్యం రీత్యా ఈ మార్పులు అనివార్యం అయ్యాయని, లబ్ధిదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.






