మోడీ చేసిన అప్పులెన్నో చెప్పండి.. కేంద్ర మంత్రి నిర్మలపై కేటీఆర్ ఫైర్

by Disha Web Desk 2 |
మోడీ చేసిన అప్పులెన్నో చెప్పండి.. కేంద్ర మంత్రి నిర్మలపై కేటీఆర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడే ఆమె కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. భారత్ స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత 67 ఏండ్ల వ్యవధిలో 14 మంది ప్రధానులు రూ. 56 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఎనిమిదేండ్ల కాలంలోనే అది రూ. 100 లక్షల కోట్లు దాటిందని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా ప్రకారం లెక్కలు వేస్తే అది ప్రతీ భారతీయుడి మీద సగటున రూ. 1.25 లక్షల మేరకు అప్పు ఉన్నట్లవుతుందని వివరించారు. ఆర్థిక క్రమశిక్షణ గురించి లెక్చర్లు ఇచ్చే నిర్మలా సీతారామన్ వీటికి సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

డబుల్ ఇంజన్ గ్రోత్ అని కేంద్ర మంత్రులు గొప్పలు చెప్పుకోవడమే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిందని, తెలంగాణను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేళ్ళ కాలంలో తీసుకున్న అప్పు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు లోబడే ఉన్నదని, మొత్తం రాష్ట్ర జీఎస్‌డీపీలో అది 23.5% మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న అప్పులను లెక్కిస్తే దేశం మొత్తం జీడీపీలో 59% దాటిందన్నారు. రాష్ట్రాల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే అత్యల్ప రుణాలతో తెలంగాణ 23వ స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. ఈ లెక్కలన్నీ తాము చెప్తున్నవి కావని, రిజర్వు బ్యాంకే అన్ని రాష్ట్రాల గణాంకాలను విశ్లేషించి రూపొందించిన నివేదికలో వెల్లడించిన వాస్తవాలని తెలిపారు.

తెలంగాణ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం దేశ జనాభాలో కేవలం 2.5% మాత్రమేనని, కానీ ఆర్థికంగా చూస్తే మొత్తం దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 5%గా ఉన్నదని, తెలంగాణ నుంచి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం ఈ రూపంలో సహకారం పొందుతున్నదన్నారు. డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకోడానికి బదులుగా ఆర్థిక క్రమశిక్షణ గురించి గొంతు విప్పే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డబుల్ ఇంపాక్ట్ గవర్నెన్స్ గురించి మాట్లాడాలని సలహా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2.78 లక్షలుగా ఉంటే దేశ సగటు మాత్రం కేవలం రూ. 2.49 ల6లు మాత్రమేనని గుర్తుచేశారు. దీన్ని పరిశీలిస్తే ఆర్థికంగా బలంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రమా లేక మోడీ నేతృత్వంలోని దేశమా అనేది స్పష్టమవుతుందన్నారు. తెలంగాణ ఆలోచిస్తున్న తరహాలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే దేశ ఆర్థిక ప్రగతి ఈపాటికి 4.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేదన్నారు.

Next Story

Most Viewed