- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ రిమ్స్, కొండాపూర్, నిజామాబాద్ జీజీహెచ్‌లలో ఐవీఎఫ్ సేవలు : మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఇన్‌ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్న జంటలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇన్‌ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్న జంటలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ దిశగా ఆదిలాబాద్ రిమ్స్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లలో ఐవీఎఫ్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. గాంధీలో ఐవీఎఫ్ సేవలు వినియోగించుకొని పుట్టిన శిశువును ప్రభుత్వ సేవల ద్వారా మొదటి శిశువుగా గుర్తిస్తూ వెంగల్ రావు నగర్ లోని కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో గురువారం వైద్యులు, సిబ్బందిని మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్లి ప్రజలు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మాతృత్వపు కలను సాకారం చేసుకోవాలనుకునే ప్రతి కుటుంబానికి ప్రభుత్వమే అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌ను 2024 అక్టోబర్‌లో, పెట్లబుర్జు ఐవీఎఫ్ సెంటర్‌ను డిసెంబర్‌లో ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ రెండు సెంటర్ల ద్వారా సుమారు 27,300 మంది ఫర్టిలిటీ వైద్య సేవలు పొందడం ఇన్‌ఫర్టిలిటీ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఈ సంఖ్యలు మనపై మరింత బాధ్యతను పెంచుతున్నాయని చెప్పారు. త్వరలో ప్రారంభించనున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కూడా ఒక ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ సేవలను విస్తరించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.
అధికారులకు హెచ్చరిక..
టీవీవీపీని డైరెక్టరేట్‌గా మార్చుతున్నామని, వైద్యులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అదే సమయంలో విధులకు గైర్హాజరు కావడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కొన్ని ఆసుపత్రుల్లో హాజరు శాతం తక్కువగా ఉన్న పరిస్థితిని ఇకపై అనుమతించబోమని అన్నారు. డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లు, ఆసుపత్రి సూపరింటెండెంట్లు మరింత సీరియస్‌గా పనిచేయాలని, క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, వైద్య విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.






