మాటలతో డిసి వేధింపులు… మహిళా ఎస్‌ఎఫ్‌ఏ ఆవేదన!

by Kodari Anjali |

తనని డీసీ లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ప్రజాభవన్‌లో మహిళా ఎస్‌ఎఫ్‌ఏ ఫిర్యాదు చేశారు.

మాటలతో డిసి వేధింపులు… మహిళా ఎస్‌ఎఫ్‌ఏ  ఆవేదన!
X

దిశ, మేడ్చల్ బ్యూరో: సర్కిల్ పరిధిలో ఉన్నత అధికారిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఎస్ ఎఫ్ ఏ గా పనిచేస్తున్న తనను మాటలతో వేధిస్తూ అవమానకరంగా ప్రవర్తించడమే కాకుండా అన్యాయంగా తన లాగిన్‌ను నిలిపివేసిన అంశంపై బాధితురాలు మంగళవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ జోన్, జీడిమెట్ల సర్కిల్‌లో గత 25 ఏళ్లుగా ఎస్‌ఎఫ్‌ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాల్పడుతున్న వేధింపుల వల్ల తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నా అని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు.

లక్ష్యంగా చేసుకుని మానసిక హింస..

జీడిమెట్ల సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే తనని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వేధించడంతోపాటుగా, ఇతర సహోద్యోగులు, కార్మికుల ముందు అవమానకరంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. అధికారి ఏరియా విజిట్‌కు వచ్చిన సమయంలో కార్మికుల ముందే తనను "ఫాల్తు మొహం" అని దూషించారని, అందరి ఎదుటా "రేపటి నుంచి నువ్వు జాడు కొట్టు" అంటూ పరుషంగా మాట్లాడుతూ.. తీవ్రంగా అవమానించారని వాపోయారు. "నీ చరిత్ర అంతా తెలుసు, నీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం తెలుసు” అంటూ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎందరో అధికారులు తన పనితీరును మెచ్చుకోగా, ప్రస్తుతం సదరు అధికారి ప్రవర్తన వల్ల ప్రశాంతంగా పనిచేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

లాగిన్ నిలిపివేత.. ఆర్థిక ఇబ్బందులు..

ఒంటరి మహిళ కావడం, ఇద్దరు పిల్లల బాధ్యత తనపైనే ఉన్నదని, ప్రస్తుతం లాగిన్ లేక, జీతం రాక కుటుంబం గడవడం అత్యంత కష్టంగా మారిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె ఇప్పటికే కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌కు రెండు సార్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు, అలాగే రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరి ఆశగా ప్రజాభవన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. తన లాగిన్‌ను పునరుద్ధరించి, గౌరవప్రదంగా విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని, ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన రక్షణ కల్పించాలని బాధితురాలు ఉన్నతాధికారులను వేడుకుంటుంది.

Next Story