అక్రమ నిర్మాణాలకు అడ్డేదీ...?

by Disha Web Desk 20 |
అక్రమ నిర్మాణాలకు అడ్డేదీ...?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఇక్కడ అక్రమ నిర్మాణ జోరు ఓ రేంజ్ లో సాగుతోంది. అడిగే వారు లేకనో లేదా అడుగకుండా ‘మేనేజ్’ చేస్తున్నారో తెలియదుకానీ. అక్రమ నిర్మాణాల తంతు మాత్రం గోదుమకుంట గ్రామపంచాయితీ పరిధిలో ప్రమాదకర స్థాయికి చేరింది. భవన నిర్మాణాలకు ఏలాంటి అనుమతులు తీసుకోకుండానే యధేచ్చగా ఇక్కడ బహుళ అంతస్థులను నిర్మిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయితీ స్థాయి నుంచి జిల్లాఅధికార యంత్రాంగం కుమ్మక్కై ప్రభుత్వ ఖజనాకు గండి కొడుతున్నారు. అనుమతులేని ఒక్కో నిర్మాణం వద్ద రూ.లక్షల్లో వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.

పుట్ట గొడుగుల్లా అక్రమ నిర్మాణాలు..

మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గోదుమ కుంట గ్రామం అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారింది. స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పి వందలసంఖ్యలో అక్రమ భవనాలను నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడుపలు వాణిజ్య, బహుళ అంతస్తులను కూడా కడుతున్నట్లు వాపోతున్నారు. ఇక్కడ భూముల రేట్లు అకాశాన్నంటడంతో నిర్మాణాలు కూడా అదే దిశగా సాగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులే కొందరు బిల్డర్లుగా అవతరమేత్తి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలను నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామపంచాయితీలో గాని, హెచ్ఎండీఏలో గాని అనుమతులు తీసుకోకుండానే పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజనాకు భారీ మొత్తంలో గండి పడుతోంది.

పై స్థాయిలో 'మేనేజ్'

అక్రమ నిర్మాణాల పై ఇప్పటికే గ్రామస్తులు పలుమార్లు మండల పంచాయితీ, జిల్లా కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డును అక్రమించుకోని నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫోటోలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా స్థానిక ప్రజాప్రతి ఒకరు ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలనెలా పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టచెప్పుతున్నట్లు తెలిసింది. దీంతో గ్రామం నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా గోదుమకుంటలో కోనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని జిల్లా టాస్క్ పోర్స్, ఉన్నతాధికారులకు గ్రామస్తులు విజ్ఠప్తి చేస్తున్నారు.


Next Story

Most Viewed