ఆర్చరీ వరల్డ్ కప్‌ స్టేజ్-1లో భారత జట్టు చరిత్ర.. సత్తాచాటిన తెలుగు కుర్రాడు ధీరజ్‌

by Dishanational3 |
ఆర్చరీ వరల్డ్ కప్‌ స్టేజ్-1లో భారత జట్టు చరిత్ర..  సత్తాచాటిన తెలుగు కుర్రాడు ధీరజ్‌
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ సత్తాచాటాడు. రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో తరుణ్‌దీప్, ప్రవీణ్ రమేశ్‌లతో కలిసి ధీరజ్ భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. ఫైనల్‌లో భారత జట్టు 5-1(57-57, 57-55, 55-53) తేడాతో వరల్డ్ చాంపియన్ కొరియా జట్టును ఓడించింది. భారత రికర్వ్ జట్టు 14 ఏళ్ల తర్వాత కొరియాను ఓడించడం మరో విశేషం. అంతేకాకుండా, ఈ విజయంతో భారత జట్టు పారిస్ ఒలింపిక్స్‌కు పాల్గొనే అవకాశాలను మెరుగుపర్చుకుంది.

అలాగే, రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అంకితతో కలిసి ధీరజ్ కాంస్యం సాధించాడు. సెమీస్‌లో కొరియా చేతిలో ఓడి ఈ ద్వయం స్వర్ణ పోరుకు దూరమైంది. అయితే, బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో సత్తాచాటిన ధీరజ్ ద్వయం 6-0 తేడాతో మతియాస్ గ్రాండే-అలెజాండ్రా వాలెన్సియా(మెక్సికో) జంటను చిత్తు చేసింది. మరోవైపు, 2022 డిసెంబర్‌లో తల్లి అయిన తర్వాత ఆటకు దూరంగా ఉన్న భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపిక కుమారి పునరాగమనంలో సత్తాచాటింది. రికర్వ్ మహిళల వ్యక్తిగత విభాగంలో రజతం సాధించింది. ఫైనల్‌లో దీపక్ 0-6 తేడాతో లిమ్ సిహ్యున్(కొరియా) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. శనివారం కాంపౌండ్ విభాగంలో ఐదు పతకాలు దక్కాయి. మొత్తంగా ఈ టోర్నీలో భారత ఆర్చర్లు 8 పతకాలతో(5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) చరిత్ర సృష్టించారు. ఒక ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పతకాలతోపాటు అత్యధిక స్వర్ణాలు గెలిచారు.



Next Story

Most Viewed